నవతెలంగాణ-హైదరాబాద్ : తగ్గినట్లే తగ్గిన బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. యూఎస్ ఫెడ్‌కు కొత్త ఛైర్మన్ నియామకం, సీఎంఈ మార్జిన్‌ను పెంచడం, గరిష్ఠాల వద్ద భారీ ప్రాఫిట్ బుకింగ్ కారణంగా ఈ రెండు లోహాల ధరలు భారీగా పతనమైన సంగతి తెలిసిందే. దీన్ని అవకాశంగా తీసుకుని మదుపర్లు దీర్ఘకాలిక వ్యూహంతో కొనుగోళ్లకు దిగడంతో వీటికి మళ్లీ డిమాండ్ ఏర్పడింది. దీంతో అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ఔన్సు 4,887 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. వెండి 85.98 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
దీంతో దేశీయంగానూ ఈ రెండు లోహాల ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 10 గ్రాముల మేలిమి పసిడి ధర 1.56 లక్షల వద్ద కొనసాగుతుండగా.. కిలో వెండి ధర రూ.2.74 లక్షలు పలుకుతోంది. సోమవారం ధరలతో పోలిస్తే బంగారం దాదాపు రూ.6 వేలు పెరగ్గా.. వెండి రూ.20 వేలకు పైగా పెరిగింది.



