– ఇండియాలో మత ఘర్షణలతోనే ఎక్కువ మంది చనిపోతున్నారు
– భారతదేశాన్ని అమెరికాకు తాకట్టు పెట్టిన బీజేపీ
– ట్రంప్ మాటలు విని యుద్ధం ఆపేయడం సిగ్గుచేటు : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య
– పార్టీ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా స్థాయి విస్తృత సమావేశం
నవతెలంగాణ-సిటీబ్యూరో/కాప్రా
దేశంలో జరుగుతున్న కుల, మతాల మధ్య ఘర్షణలకు బీజేపీ మతోన్మాదమే కారణమని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య అన్నారు. భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధంలో కంటే మత ఘర్షణలోనే దేశంలో ఎక్కువమంది ప్రజలు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మతోన్మాద బీజేపీ వ్యవహరిస్తున్న వైఖరి సరికాదన్నారు. ఆదివారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఈసీఐఎల్ కమలానగర్‌లోని సీపీఐ(ఎం) కార్యాలయంలో నిర్వహించిన జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో వీరయ్య మాట్లాడారు. భారత్-పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ దుండగులు మన దేశ ప్రజలపై కాల్పులు జరిపి చంపేస్తే, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మాత్రం పాకిస్తాన్‌పై యుద్ధం ప్రకటించినట్టే ప్రకటించి యుద్ధం చేయకుండా అమెరికాతో చేతులు కలిపి.. ఆ దేశ అధ్యక్షులు ట్రంప్ యుద్ధం ఆపేయాలని ప్రకటన చేసేసరికి యుద్ధం ఆపేసిందని తెలిపారు. దీన్నిబట్టి భారత్‌ను అమెరికాకు తాకట్టు పెట్టినట్టుగా ప్రజలు భావిస్తున్నారని అన్నారు. అమెరికా బడా పెట్టుబడిదారీ దేశం అనీ, భారత్-పాకిస్తాన్ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే తానెలా బిజినెస్ చేసుకోవాలని ఆలోచించేదే అమెరికా అని చెప్పారు. యుద్ధంలో ఎందరో ప్రజలు, ఆర్మీ అధికారులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధం ప్రారంభం చేసేటప్పుడు అఖిలపక్షంతో సమావేశం జరిపి.. యుద్ధం ముగింపు విషయం అఖిలపక్షానికి తెలియకుండానే ట్రంప్ మాటలు విని యుద్ధం ముగించడం సిగ్గుచేటన్నారు. గతంలో భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధాలు జరిగినప్పుడు రెండు దేశాలే చర్చించుకుని యుద్ధం ముగించాయనీ, మూడో దేశం జోక్యం లేకుండానే మన స్వతంత్రతను కాపాడుకున్నామని గుర్తు చేశారు. అమెరికా చైనాపై యుద్ధం ప్రకటిస్తే సోషలిస్టు దేశాలన్నీ ఒక్కటై, అమెరికాపై యుద్ధం చేస్తాయని తెలిపారు. ఇటీవల జరిగిన సీపీఐ(ఎం)అఖిల భారత మహాసభల్లో పార్టీ బలం, బలహీనతల గురించి చర్చించు కున్నట్టు తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి పి.సత్యం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జె.చంద్రశేఖర్, కోమటి రవి, ఎ.అశోక్, జి.శ్రీనివాసులు, ఐ,రాజశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు ఎం.శ్రీనివాస్, వెంకట్‌రామయ్య, రాథోడ్ సంతోష్, ఎం.శంకర్, ఎం.నరేష్, వెంకన్న, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
కుల, మత ఘర్షణలకు బీజేపీ మతోన్మాదమే కారణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES