– రాజా బహదూర్ బినామీలను తరిమికొట్టాలి
– ఒక వ్యక్తి పేర 480 ఎకరాలు ఉండటం సీలింగ్ యాక్ట్‌కు విరుద్ధం
– భూ అక్రమాల వెనక పెద్దల హస్తం
– ఫిర్యాదు చేసినా సీసీఎల్ స్పందించకపోవడం దారుణం
– ఉద్యమాల ద్వారానే భూ హక్కులను సాధించుకోవాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
దున్నేవానికే భూమి దక్కాలని, కొందరు ఆక్రమణదారులు గిరిజనుల భూములపై కన్నేశారని, ఒక వ్యక్తి పేరు మీద 400 ఎకరాల భూమి ఉండటం సీలింగ్ యాక్ట్‌కు విరుద్ధమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలం షాపూర్‌శివారు, మామిడిమాడ శివారు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలివ్వాలని సీపీఐ(ఎం), భూ పోరాట సాధన కమిటీ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలోని బృందం పర్యటించింది. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. గిరిజనుల సమస్యపై నాలుగు నెలలుగా ఆందోళనలు నిర్వహిస్తున్నా, పాదయాత్రలు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరైనది కాదన్నారు. ఘనపూర్ మండల పరిధిలోని ఎనిమిది గిరిజన తండాలకు చెందిన 800 గిరిజన కుటుంబాలు 480 ఎకరాల భూములను ఐదు తరాలుగా సాగు చేసుకుంటు న్నాయని తెలిపారు. కాగా, రాజ బహుదూర్ పేరుతో ఇప్పుడు వచ్చి ఆ భూములు మావంటూ కబ్జా చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. సాగు భూములు తప్ప ఇతర ఆస్తులు లేని అమాయక గిరిజ నులను భయభ్రాంతులకు గురి చేయడం దారుణమన్నా రు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఎండోమెంట్ భూదాన్ ఉద్యమాలనే టార్గెట్ చేస్తూ భూ బకాసురులు భూములను ఆక్రమించుకుంటున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా సీలింగ్ యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ బడా భూస్వాములైన రాజా బహదూర్ బినామీలకు ఇంత పెద్ద మొత్తంలో భూములు ఉండటానికి కారణమేమిటని ప్రశ్నించారు. ఏండ్ల తరబడి గిరిజన కుటుంబాలు కలెక్టర్ ఆర్డీఓ, ఎమ్మార్వోల చుట్టూ పట్టాల కోసం తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. కలెక్టర్ గిరిజనుల విన్నపాన్ని సీసీఎల్‌కు పంపినా అక్కడి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడం చూస్తుంటే ఈ పాలకులు ఎవరి పక్షాన ఉంటున్నారో తెలుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సాగుచేసుకుంటున్న గిరిజనులకు పట్టాలివ్వాలని, సీలింగ్ చట్టం ప్రకారం రాజ బహుదూర్‌కు ఉన్న పట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనులు ఐక్యమత్యంతో ఉండి పట్టాలు సాధించుకునే దాకా సీపీఐ(ఎం) వారికి అండగా నిలుస్తున్నదని, ముందుండి పోరాడుతుందని తెలిపారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు మాట్లాడుతూ.. వందల ఏండ్ల నుంచి సాగు చేసుకుంటున్న గిరిజన తండావాసులకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మేకల ఆంజనేయులు, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బాల్య నాయక్, భూపోరాట సాధన కమిటీ కన్వీనర్ శుక్రు నాయక్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి పరమేశ్వర చారి, ఐద్వా జిల్లా కార్యదర్శి లక్ష్మి, నాయకులు జయమ్మ, కృష్ణ, భరత్, దాసు, శ్రీను, లక్షనాయక్, రాజి, మన్నే తదితరులు పాల్గొన్నారు.
దున్నేవానికే భూమి దక్కాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES