నవతెలంగాణ-హైదరాబాద్ : ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో జరిగిన సంచలన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహాత్మాగాంధీకి చెందిన 420 కిలోల బరువైన కాంస్య విగ్రహాన్ని దుండగులు చోరీ చేశారని ఓ డిజిటల్ మీడియా సంస్థ తాజాగా వెలుగులోకి తీసుకువచ్చింది. మెల్‌బోర్న్ సబర్బ్ రోవ్‌విల్‌లో ఉన్న ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ బయట ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ఎత్తుకెళ్లిపోవడం తీవ్ర సంచలనం అయింది. జనవరి 12 అర్ధరాత్రి 12:50 గంటల సమయంలో ముగ్గురు దుండగులు విగ్రహాన్ని పాదాల వద్ద కత్తిరించి తీసుకుపోయారు. అక్కడ కేవలం విగ్రహానికి చెందిన కాళ్లు మాత్రమే మిగిలి ఉండటం కలకలం రేపింది.
ముసుగులు ధరించిన గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు కటింగ్ మెషిన్ సహాయంతో విగ్రహాన్ని బేస్ వద్ద నుంచి కత్తిరించినట్లు సీసీటీవీలో రికార్డు అయింది. అనంతరం వారు వైట్ కలర్ వ్యాన్‌లో విగ్రహాన్ని తరలించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ చారిటబుల్ ట్రస్ట్ కమిటీ సభ్యుడు సంతోష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారత జాతీయ నాయకుడి విగ్రహాన్ని ఇలా ధ్వంసం చేసి ఎత్తుకెళ్లడం ఆవేదనకు గురి చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ గాంధీ విగ్రహం ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్), న్యూఢిల్లీ నుంచి బహుమతిగా అందింది.
2021 నవంబర్ 12న అప్పటి ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇండియన్ – ఆస్ట్రేలియన్ కమ్యూనిటీకి ఇది సాంస్కృతికంగా, చారిత్రకంగా ప్రత్యేక ప్రాధాన్యత కల్గి ఉంది. ఈ కేసును విక్టోరియా పోలీస్ నాక్స్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ దర్యాప్తు చేస్తోంది. స్క్రాప్ మెటల్ డీలర్లను అప్రమత్తం చేసిన పోలీసులు, బ్రాంజ్ విగ్రహాన్ని అమ్మేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. అయితే ఈ దొంగతనం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.



