Monday, May 26, 2025
Homeఆటలుటైటాన్స్‌ చిత్తు

టైటాన్స్‌ చిత్తు

- Advertisement -

83 పరుగుల తేడాతో గుజరాత్‌ ఓటమి
– చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఊరట విజయం

ప్లే ఆఫ్స్‌కు చేరిన జట్లు గ్రూప్‌ దశ ఆఖర్లో తడబాటుకు గురవుతున్నాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్‌ టైటాన్స్‌ను పదో స్థానంలో నిలిచిన చెన్నై సూపర్‌కింగ్స్‌ చిత్తు చేసింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సూపర్‌కింగ్స్‌ 83 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఊరట విజయంతో సూపర్‌కింగ్స్‌ సీజన్‌ను ముగించగా.. వరుసగా రెండో ఓటమితో టైటాన్స్‌ ప్లే ఆఫ్స్‌కు సిద్ధమవుతోంది.
నవతెలంగాణ-అహ్మదాబాద్‌

ఐపీఎల్‌18లో దారుణంగా నిరాశపరిచిన చెన్నై సూపర్‌కింగ్స్‌.. సీజన్‌ను ఘనంగా ముగించింది. యువ ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇచ్చిన సూపర్‌కింగ్స్‌ ఆదివారం అహ్మదాబాద్‌లో గుజరాత్‌ టైటాన్స్‌పై 83 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. సీజన్లో అత్యంత నిలకడగా రాణించిన టైటాన్స్‌ను చిత్తు చేసిన సూపర్‌కింగ్స్‌ వచ్చే సీజన్‌కు అవసరమైన ఆశావహ దృక్పథం సాధించింది!. 231 పరుగుల ఛేదనలో గుజరాత్‌ టైటాన్స్‌ తేలిపోయింది. ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగని టైటాన్స్‌ 18.3 ఓవర్లలో 147 పరుగులకు కుప్పకూలింది. సూపర్‌కింగ్స్‌ బౌలర్లలో అన్షుల్‌ (3/13), నూర్‌ అహ్మద్‌ (3/21) మూడు వికెట్లతో మెరిశారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 230 పరుగులు చేసింది. డెవాల్డ్‌ బ్రెవిస్‌ (57, 23 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), డెవాన్‌ కాన్వే (52, 35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో రాణించారు. ఐపీఎల్‌18లో సూపర్‌కింగ్స్‌కు ఇది నాల్గో విజయం కాగా.. గుజరాత్‌ టైటాన్స్‌కు ఐదో పరాజయం.
మెరిసిన కాన్వే, డెవాల్డ్‌
తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్‌ సమిష్టి మెరుపులతో భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు ఆయుశ్‌ మాత్రె (34, 17 బంతుల్లో 3 ఫోర్లు,3 సిక్స్‌లు), డెవాన్‌ కాన్వే (52) ధనాధన్‌ ఆరంభం అందించారు. ఆయుశ్‌ పవర్‌ప్లేలో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఆరు ఓవర్లలోనే 68/1తో భారీ స్కోరుకు పునాది పడింది. ఆయుశ్‌ నిష్క్రమించినా.. ఊర్విళ్‌ పటేల్‌ (37, 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శివం దూబె (17, 8 బంతుల్లో 2 సిక్స్‌లు) దంచికొట్టారు. డెవాల్డ్‌ బ్రెవిస్‌ (57) నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లతో విశ్వరూపం చూపించాడు. రవీంద్ర జడేజా (21 నాటౌట్‌) అజేయంగా నిలిచాడు. 20 ఓవర్లలో 5 వికెట్లకు సూపర్‌కింగ్‌సÊ 230 పరుగులు చేసింది. టైటాన్స్‌ బౌలర్లలో ప్రసిద్‌ కృష్ణ (2/22) రెండు వికెట్లు తీసుకోగా.. సాయి కిశోర్‌, రషీద్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌లు తలా ఓ వికెట్‌ పడగొట్టారు.
ఛేదనలో చతికిల
231 పరుగుల ఛేదనలో గుజరాత్‌ టైటాన్స్‌ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. సాయి సుదర్శన్‌ (41) మెరిసినా.. టాప్‌ ఆర్డర్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (13), జోశ్‌ బట్లర్‌ (5) సహా రూథర్‌ఫోర్డ్‌ (0) నిరాశపరిచారు. 30/3తో కష్టాల్లో కూరుకున్న గుజరాత్‌ టైటాన్స్‌ మళ్లీ కోలుకోలేదు. షారుక్‌ ఖాన్‌ (19), రాహుల్‌ తెవాటియ (14), రషీద్‌ ఖాన్‌ (12), గెరాల్డ్‌ కొయేట్జి (5) నిరాశపరిచారు. అర్షద్‌ ఖాన్‌ (20) ఆఖర్లో ఓటమి అంతరాన్ని కుదించాడు. 18.3 ఓవర్లలో 147 పరుగులకే గుజరాత్‌ టైటాన్స్‌ కుప్పకూలింది. గ్రూప్‌ దశ చివరి రెండు మ్యాచుల్లో ఓడినా.. గుజరాత్‌ టైటాన్స్‌ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. సూపర్‌కింగ్స్‌ బౌలర్లలో అన్షుల్‌, నూర్‌ అహ్మద్‌ మూడేసి వికెట్లు తీసుకోగా.. రవీంద్ర జడేజా (2/17), ఖలీల్‌ అహ్మద్‌ (1/17) రాణించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -