నవతెలంగాణ-హైదరాబాద్: సర్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో తన వాదనలను విన్పించారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కేంద్రం ఎన్నికల సంఘం చేపట్టిన ప్రక్రియ ద్వారా ఉద్దేశపూర్వంగా ఓట్లను తొలగిస్తున్నారని, ఈ సర్వేతో లక్షల్లో నిజమైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోతున్నారని ధర్మాసనం ముందు ఆవేదన వ్యక్తంచేశారు. బతికున్న వారిని కూడా ‘చనిపోయినట్టు గా ప్రకటించారని ఈ సందర్భంగా ఆమె ఆరోపించారు. అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాల నుండి సుమారు 8,300 మంది మైక్రో అబ్జర్వర్లను తీసుకువచ్చి, సరైన వెరిఫికేషన్ లేకుండా పేర్లను తొలగిస్తున్నారని ఆమె కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
సీఎం మమతా బెనర్జీ వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్లపై ఎన్నికల సంఘానికి కోర్టు నోటీసులు ఇచ్చింది. అలాగే ఈ ప్రక్రియలో రాష్ట్ర అధికారుల పాత్ర ఉండాలని భావించిన కోర్టు, ఓటరు వెరిఫికేషన్ కోసం అందుబాటులో ఉంచగల గ్రూప్-బి (క్లాస్-2) అధికారుల జాబితాను వచ్చే సోమవారం లోపు సమర్పించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఇదే అంశంపై ఇప్పటికే ఈసీ దాఖలు చేసిన పిటిషన్లు ఉండగా.. వాటిని కూడా అనుబంధ పిటిషన్లతో కలిపి ఈ కేసును వచ్చే సోమవారం (ఫిబ్రవరి 9) మళ్లీ విచారించనున్నట్లు కోర్టు తెలిపింది.



