Wednesday, February 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ మోసాలకు మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి

కాంగ్రెస్ మోసాలకు మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి

- Advertisement -

నవతెలంగాణ -పరకాల 
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని, ఆ పార్టీ మోసాలకు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం పరకాల పట్టణంలోని 1, 2, 3, 12, 13, 14, 15, 22 వార్డులలో బిఆర్ఎస్ అభ్యర్థుల తరపున వారు ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త బొడ్రాయి సెంటర్లో ఏర్పాటు చేసిన రోడ్డు షోలో వారు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
అభివృద్ధిని అటకెక్కించారు: చల్లా ధర్మారెడ్డి
మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పరకాల పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత గతంలో మంజూరైన నిధులను కూడా రద్దు చేశారని విమర్శించారు. తాము వేసిన శిలాఫలకాలను ధ్వంసం చేసి, కొత్తవి పెట్టి తామే చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. “దమ్ముంటే 100 పడకల ఆస్పత్రి, డిగ్రీ కళాశాల, ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లను పూర్తి చేయాలి” అని ఆయన డిమాండ్ చేశారు. గృహలక్ష్మి లబ్ధిదారులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు.
కేసీఆర్ పాలన మళ్ళీ రావాలి: కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
రాష్ట్రంలో కేసీఆర్ పాలన ఉంటేనే సంక్షేమం బాగుంటుందని వాసుదేవ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం వస్తే ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమయ్యాయని నిలదీయాలని కార్యకర్తలకు సూచించారు. ప్రతి కార్యకర్త పట్టుదలతో పనిచేసి పరకాలపై గులాబీ జెండా ఎగురవేయాలని కోరారు.
దొంగ హామీల దొంగలను గల్లా పట్టి నిలదీయండి: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్
ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగారు. “తులం బంగారం, స్కూటీలు ఏమయ్యాయని ఆడబిడ్డలు కాంగ్రెస్ నేతలను నిలదీయాలి. రెండున్నరేళ్లలో 128 మంది గురుకుల విద్యార్థులు మరణించడం అత్యంత బాధాకరం” అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ను అవమానిస్తూ, ఆయన ఇంటికి సిట్ నోటీసులు అంటించడం కాంగ్రెస్ అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. నియోజకవర్గంలోని గ్రామాలపై అవగాహన లేని స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. పట్టణ ప్రగతి కింద కేసీఆర్ హయాంలో జరిగిన పనులు, పార్కులు, డ్రైనేజీలే ఇప్పటికీ కనిపిస్తున్నాయని, కొత్తగా చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు, పార్టీ ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -