నవతెలంగాణ – జన్నారం
వెదురు ఉత్పత్తులతో అభివృద్ధిని సాధించాలని జన్నారం అటవీ డివిజనల్ అధికారి రామ్ మోహన్ సూచించారు. జన్నారం మండలం ఇంధనపల్లి గ్రామంలో శిక్షణా పొందిన ఆదివాసులకు అటవీ శాఖ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన వెదురు ఉత్పత్తులు శిక్షణా కేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మారుతున్న సమాజానికి అనుగుణంగా తక్కువ ముడి సరుకుతో ఎక్కువ ధర వచ్చే కళాకృతులు తయారు చేస్తే మార్కెటింగ్ అవకాశాలు ఉన్నాయని సూచించారు. ఆసక్తితో కేంద్రాన్ని నిర్వహించుకునే వారికి తమ శాఖ సహాయం ఎల్లవేళల ఉంటుందని చెప్పారు. ఇంధనపల్లి రేంజి అధికారి జి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. వెదురు ఉత్పత్తుల కేంద్ర నిర్వహణకు తాము ఎల్లప్పుడూ సహకరిస్తామని చెప్పారు. అటవీ రక్షణతో పాటు ఇలాంటి పనులు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. శిక్షణా కేంద్ర నిర్వహణకు తోడ్పడిన ఈడిఐఐ మరియు హైటికాస్ స్వచ్ఛంద సంస్థలను ఆయన అభినందించారు.
ఈడిఐఐ ప్రాజెక్టు మేనేజరు భూక్యా దేవేందర్ నాయక్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల మహిళలు నిర్వహించుకునే కుటీర పరిశ్రమలకు తమ సంస్థ పూర్తిగా తోడ్పాటు ఉంటుందని చెప్పారు. నాణ్యతగా వస్తువులను తయారు చేస్తే మార్కెటింగ్ కల్పిస్తామని అన్నారు. హైదరాబాద్ టైగర్ కన్సర్వేషన్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్ బాపురెడ్డి మాట్లాడుతూ.. అటవీ రక్షణతో పాటు తమ సంస్థ జీవనోపాదులను గుర్తించి గ్రామీణా ఆదివాసుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆర్పీజీ సంస్థ రాష్ట్ర కో ఆర్డినేటర్ రవి కుమార్ మాట్లాడుతూ.. వెదురు గడలతో నైపుణ్యంగా తయారు చేసిన వస్తువులు బాగున్నాయని, కేంద్ర అభివృద్ధికి నిధులను మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని అన్నారు. స్వచ్ఛంద సంస్థల కన్సల్టెంట్ చంద్రమోహన్ మాట్లాడుతూ.. వర్క్ షాపులో తయారుచేసే వస్తువులు నాణ్యతగా ఉంటే మార్కెట్లో ఎక్కువ ధర వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. హైటికాస్ ఉత్తర తెలంగాణ ప్రాంతీయ కో ఆర్డినేటర్ Dr. ఎనగందుల వెంకట్ మాట్లాడుతూ.. ఎలాంటి వ్యవసాయ భూములు లేని ఆదివాసి నాయకపోడ్ వర్గాన్ని తమ సంస్థ సర్వేలో వారి ఆర్థిక పరిస్థితులను గుర్తించి వెదురు ఉత్పత్తులపై శిక్షణను ఇప్పించినట్లు ఆయన చెప్పారు. ఇలాంటి పనులు చేస్తూ సమాజంలో నూతన ఒరవడిలో జీవన విధానంలోకి మారాలని సూచించారు. శిక్షణకు మరియు ఉత్పత్తి కోసం సహకరించిన అటవీశాఖ అధికారులకు ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. రెండు నెలల పాటు నిర్వహించిన శిక్షణలో పాల్గొన్న మహిళలకు ధ్రువపత్రాలను అందజేశారు.



