నవతెలంగాణ – హైదరాబాద్: ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన తాజ్‌మహల్‌కు ముప్పు వాటిల్లుతుందనే బెదిరింపుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గగనతలంలో తలెత్తే ప్రమాదాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు అత్యాధునిక యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. తాజ్‌మహల్ ప్రాంగణంలో యాంటీ డ్రోన్ వ్యవస్థను నెలకొల్పుతామని, ఇది 7 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలో పనిచేస్తుందని భద్రతా వ్యవహారాల పర్యవేక్షణాధికారి ఏసీపీ సయ్యద్ అరిబ్ అహ్మద్ తెలిపారు. ప్రస్తుతం ప్రధాన గోపురం నుంచి 200 మీటర్ల పరిధిలో ఈ వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుందని, ఈ ప్రాంతంలోకి ఏదైనా డ్రోన్ ప్రవేశిస్తే దాని సిగ్నల్స్‌ను గుర్తించి, స్వయంచాలకంగా జామ్ చేసి పని చేయకుండా చేస్తుందని ఆయన వివరించారు. దీనిని ‘స్టాప్‌కిల్’గా వ్యవహరిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థ నిర్వహణపై పోలీసు సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని, త్వరలోనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు.