నవతెలంగాణ – హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లో మానవత్వం సిగ్గుతో తలదించుకునే అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ గిరిజన మహిళ (45)పై కొందరు కామాంధులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఆపై ఆమె ప్రయివేటు భాగాల్లో ఇనుప రాడ్డును చొప్పించి పైశాచికంగా హింసించారు. అమానుష దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఉదంతాన్ని గుర్తుకు తెచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ఖండవా జిల్లాలోని ఓ గ్రామంలో శుక్రవారం ఓ వివాహ కార్యక్రమం జరిగింది. ఈ పెళ్లికి సమీప గ్రామ ప్రజలు హాజరయ్యారు. బాధితురాలు తన కుటుంబంతో కలిసి వచ్చింది. శుక్రవారం రాత్రి ఈమె అకస్మాత్తుగా అదృశ్యమైంది. శనివారం ఉదయం గ్రామంలోని ఓ ఇంటి వెనుక బాధితురాలు పడి ఉండటాన్ని కొందరు మహిళలు గమనించారు. వెంటనే ఆమె కుటుంబసభ్యులు ఇంట్లోకి తీసుకువెళ్లారు. తనపై జరిగిన అఘాయిత్యాన్ని చెప్పే ప్రయత్నంలోనే ఆమె తుదిశ్వాస విడిచింది. చాలాచోట్ల తీవ్రమైన గాయాల గుర్తులతో శరీరం రక్తమోడుతోంది. మృతదేహాన్ని ఖండవా ఆస్పత్రికి తరలించగా గర్భాశయం కూడా బయటకు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. బాధిత కుటుంబం శనివారం మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రోశ్నీ చౌకీ పోలీసులు గాలింపు చేపట్టి బాధితురాలి గ్రామానికి చెందిన ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మహిళపై సామూహిక లైంగికదాడి జరిగిందని, అదుపులోకి తీసుకొన్న అనుమానితులను విచారిస్తున్నట్లు ఏఎస్పీ రాజేశ్ రఘువంశీ తెలిపారు.
మధ్యప్రదేశ్‌లో మరో నిర్భయ ఘటన..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES