నవతెలంగాణ-హైదరాబాద్: క్యూబాకు మానవతా సహాయంతో రెండు నౌకలను పంపినట్లు మెక్సికో విదేశాంగ శాఖ ఆదివారం తెలిపింది. వెనిజులా అధ్యక్షుడు మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరిస్‌లను అమెరికా కిడ్నాప్ చేసిన అనంతరం వెనిజులా నుండి చమురు సరఫరా నిలిచిపోవడంతో క్యూబా తీవ్ర ఇబ్బందుల్లో పడింది. 814 టన్నుల సహాయం పంపిణీ చేసినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.
క్యూబాకు సామగ్రిని తీసుకువెళుతున్న రెండు నావికాదళ నౌకలు ఆదివారం బయలుదేరాయని, నాలుగురోజుల్లో క్యూబాకు చేరుకుంటాయని పేర్కొంది. తాజా పాలపొడి, మాంసం, బియ్యం, బీన్స్ మరియు వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించిన వస్తువులను పంపిణీ చేసినట్లు తెలిపింది. మరో 1500టన్నుల ఆహారపదార్థాలు పంపిణీ చేసేందుకు వేచి ఉన్నాయని పేర్కొంది. అయితే క్యూబాకు చమురు రవాణా చేసే ఏ దేశంపైనైనా సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల బెదిరింపులకు దిగిన సంగతి తెలిసిందే. దీంతో క్యూబాకు చమురును పంపిణీ చేసే మార్గం కోసం మెక్సికో అన్వేషిస్తోంది.
గతేడాది, మెక్సికో సుమారు 500 మిలియన్ డాలర్ల విలువైన చమురు మరియు పెట్రోలియం ఉత్పత్తులను క్యూబాకు రవాణా చేసినట్లు ప్రభుత్వరంగ సంస్థ పెమెక్స్ గతవారం తెలిపింది. ఇది మొత్తం ఉత్పత్తిలో 1శాతం కంటే తక్కువ.



