నవతెలంగాణ – హైదరాబాద్: పలువురు ప్రముఖులకు లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్ స్టీన్ తో సంబంధాలు ఉన్నట్లు తాజాగా బయటపడింది. అమెరికా న్యాయ శాఖ శుక్రవారం విడుదల చేసిన ఎప్ స్టీన్ ఫైల్స్ లో నార్వే దౌత్యవేత్త మోనా జూల్ పేరు 33 చోట్ల ప్రస్తావనకు వచ్చింది. ఎప్ స్టీన్ తన వీలునామాలో మోనా ఇద్దరు పిల్లలకు 10 మిలియన్ డాలర్లు రాయడం మరింత సంచలనం సృష్టించింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో నార్వే విదేశాంగ శాఖ ఆమెను పదవి నుంచి తాత్కాలికంగా తప్పించింది. మోనాపై విచారణకు ఆదేశించింది. ఈ పరిణామంతో మోనా తన పదవికి రాజీనామా చేసింది.
నార్వే క్రౌన్ ప్రిన్స్ మెట్టే మారిట్, మాజీ ప్రధాని థోర్బ్ జార్న్ జాగ్లాండ్ పేర్లు కూడా ఎప్ స్టీన్ ఫైల్స్ లో ప్రస్తావనకు వచ్చాయి. 2008 లో ఓ మైనర్ బాలికతో ప్రాస్టిట్యూషన్ చేయించాడని ఎప్ స్టీన్ పై కేసు నమోదైంది. ఓవైపు ఈ కేసు విచారణ జరుగుతుండగానే నార్వే క్రౌన్ ప్రిన్స్ మెట్టె మారిట్ ఎప్ స్టీన్ తో స్నేహం నెరపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.



