– ‘టైమ్’ ప్రభావశీలుర జాబితాలో ట్రంప్, కెయిర్ స్టార్మర్, యూనస్, మస్క్,..
న్యూయార్క్: తాము ఎంచుకున్న మార్గంలో నలుగురికీ మార్గనిర్దేశనం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తుంటారు కొంతమంది వ్యక్తులు. ప్రపంచవ్యాప్తంగా అలాంటి ప్రభావశీలురను గుర్తించి జాబితా రూపొందిస్తుంది ప్రముఖ మ్యాగజైన్ ‘టైమ్’. ఈ ఏడాది ఆ జాబితాలోకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్‌యూనస్ వంటి ప్రముఖులు చేరారు. వారిని ప్రభావవంతమైన వ్యక్తులుగా టైమ్ మ్యాగజైన్ ప్రకటించింది. కాగా, ఈ సారి ఈ జాబితాలో భారత్‌కు చెందిన ఒక్కరికి కూడా చోటు దక్కకపోవడం గమనార్హం.
2025 సంవత్సరానికి గానూ అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాను టైమ్ తాజాగా వెల్లడించింది. లీడర్స్, ఐకాన్స్, టైటాన్స్, ఆర్టిస్ట్స్, ఇన్నోవేటర్స్ ఇలా పలు కేటగిరీలుగా విభజించి ఈ వార్షిక జాబితాను రూపొందించింది. లీడర్ల కేటగిరీలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, డోజ్ అధినేత ఎలాన్ మస్క్, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రభృతులు ఉన్నారు. ఏటా టైమ్ ప్రకటించే ఈ జాబితాలో సాధారణంగా భారతీయులకు స్థానం ఉండేది. గతేడాది బాలీవుడ్ నటి అలియా భట్, ఒలింపిక్ పతక విజేత, రెజ్లర్ సాక్షి మాలిక్‌లకు చోటు దక్కింది. అంతకుముందు 2023లో ప్రముఖ తెలుగు దర్శకుడు రాజమౌళి, బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ వంటివారు ప్రభావవంతమైన వ్యక్తులుగా నిలిచారు. ఈసారి జాబితాలో భారత్ నుంచి ఏ ఒక్కరికీ చోటు దక్కకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.
భారతసంతతి నాయకురాలికి చోటు
అయితే, భారత సంతతికి చెందిన రేష్మ కెవల్‌రామణి టైమ్ జాబితాలో ఉన్నారు. ఈమె వర్టెక్స్ ఫార్మా సీఈఓగా వ్యవహరిస్తున్నారు. రేష్మకు 11ఏళ్ళ వయసులోనే ఆమె కుటుంబం అమెరికాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడింది. ఫార్మా రంగంలో రాణించిన రేష్మ అమెరికా అతిపెద్ద బయోటెక్నాలజీకి తొలి మహిళా సీఈఓగా అరుదైన ఘనత అందుకున్నారు.
భారతీయులకు దక్కని చోటు
- Advertisement -
RELATED ARTICLES