నవతెలంగాణ-హైదరాబాద్: క్యూబాపై అమెరికా సామ్రాజ్యవాద దాడిని రష్యా తీవ్రంగా ఖండించింది. విమానాలు మరియు రవాణాకు అవసరమైన ఇంధన సరఫరాపై ఆంక్షలు విధించడంతో క్యూబాలో పరిస్థితి క్లిష్టంగా మారిందని రష్యా అధ్యక్ష ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ సోమవారం పేర్కొన్నారు. అమెరికా ఆంక్షలను కఠినతరం చేయడం పరిస్థితి మరింత దిగజారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా సామ్రాజ్య వాదాన్ని ఎదుర్కోవడానికి ఉమ్మడి పరిష్కారాల కోసం దౌత్య మరియు సాంకేతిక మార్గాల ద్వారా యత్నిస్తున్నామని పెస్కోవ్ పేర్కొన్నారు. అమెరికా ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహాలు క్యూబాకు తీవ్రమైన ఇబ్బందులను కలిగిస్తున్నాయని, ఈ సమస్యల పరిష్కారం కోసం తమ పరిధిలో సాయం అందించేందుకు సాధ్యమయ్యే మార్గాల గురించి అక్కడి అధికారులతో మాట్లాడుతున్నామని అన్నారు.
క్యూబాకు రష్యా చమురు ఎగుమతులు ఇటీవలి కాలంలో స్థిరంగా ఉన్నాయని హవానాలోని రష్యా రాయబారి విక్టర్ కొరొనెల్లి గతవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. చమురు ఎగుమతులు కొనసాగుతాయని అన్నారు. ఈచర్య క్యూబా ఇంధన స్థిరత్వానికి రష్యా నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.



