Wednesday, February 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపాడి పైనా అమెరికా ఒప్పంద విషం

పాడి పైనా అమెరికా ఒప్పంద విషం

- Advertisement -

పాల ఉత్పత్తుల దిగుమతితో పదికోట్లమంది రైతులపై ప్రభావం
పాలసేకరణలో బోనస్‌ ఇవ్వొద్దని కేంద్రం ఒత్తిళ్లు
తెలంగాణలోని చిన్న పాల పరిశ్రమలు మూతపడే ప్రమాదం
విజయ, మదర్‌డెయిరీ, ముల్కనూరు, కరీంనగర్‌ డెయిరీలకూ ఎఫెక్ట్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకున్న మోడీ సర్కారు దేశంలోని పాడి రైతులకు రక్షణగా ఉంటామని నమ్మబుచ్చుతున్నప్పటికీ పాడి రైతులపై తీవ్ర ప్రభావం పడబోతున్నదనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతున్నది. పాడి పరిశ్రమపై ప్రత్యక్షంగా ఆధారపడి జీవిస్తున్న పది కోట్ల మంది రైతులపైనా, పరోక్షంగా మరో ఐదు కోట్లమందిపైనా దాని ఎఫెక్ట్‌ ఉండబోతున్నది. ఇప్పటికే పాల సేకరణలో, పంటలకు బోనస్‌ ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం ఒత్తిడి తెస్తున్నది. మన దేశంలో గుజరాత్‌కు చెందిన అమూల్‌ (3 కోట్ల లీటర్లు), కర్నాటకు చెందిన నందిని(కోటి లీటర్లు), తమిళనాడు కో-ఆపరేటివ్‌ సొసైటీ(కోటి లీటర్లు), హెరిటేజ్‌ (25 లక్షల లీటర్లు) సంస్థలు పాల సేకరణలో ముందువరుసలో ఉన్నాయి. తెలంగాణకు చెందిన మదర్‌ డెయిరీ(మూడు లక్షల లీటర్లు), విజయ డెయిరీ(3 లక్షల లీటర్లు), కరీంనగర్‌, ముల్కనూరు, మస్కతి డెయిరీలు కూడా ప్రముఖంగా ఉన్నాయి. మొత్తంగా మన దేశంలో 239.30 మిలియన్‌ టన్నుల పాల ఉత్పత్తులు జరుగుతున్నాయి. మన పాడి ఉత్పత్తులు మనకు సరిపోయేలా ఉన్నాయి. ప్రపంచ పాల ఉత్పత్తుల వాటాలో మనది 24 నుంచి 25 శాతముంది. ఇప్పటిదాకా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పాల ఉత్పత్తులపై 60 శాతం సుంకం విధిస్తున్న పరిస్థితి. సర్‌చార్జీలు, జీఎస్టీ ఇతరత్రాలు కలుపుకుంటే అది 70 శాతం వరకు ఉంటుంది. సుంకాలు, ట్రాన్స్‌పోర్టు చార్జీలు, సర్‌చార్జీల భారంతో విదేశాలు మనకు పాల ఉత్పత్తులను పెద్దగా ఎగుమతి చేయడం లేదు.

గతంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం అన్ని పన్నులు భరిస్తూనే రూ.30కి లీటర్‌ చొప్పున ఇస్తామని ఒత్తిడి తేగా…మన దేశంలోని పాడి పరిశ్రమ దివాళా తీస్తుందనే భయంతో అప్పటి పాలకులు ఒప్పుకోలేదు. పలు దేశాలు రాష్ట్రప్రభుత్వాలతో చర్చలు జరిపినా ససేమిరా అన్నాయి. ఇప్పుడు డ్రాప్టు స్వేచ్ఛాఒప్పందంలో పాలు, పాల ఉత్పత్తి దిగుబడి చేసుకోవాలనే నిబంధన ఉందనే చర్చ నడుస్తున్నది. దీని ప్రభావం యూపీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్రపై తీవ్రంగా పడే అవకాశముంది. ఆ రాష్ట్రాల నుంచే 53 శాతం పాల ఉత్పత్తులు వస్తున్నాయి. పాడిపరిశ్రమలో మన దేశ గ్రోత్‌రేట్‌ 2014 నుంచి ఇప్పటి వరకూ 27 నుంచి 30 శాతం ఉండగా..ప్రపంచ వృద్ధి రేటు 14 శాతమే ఉంది. అంటే ప్రపంచంతో పోలిస్తే గ్రోత్‌రేట్‌ అధికంగా ఉన్నప్పటికీ అమెరికా నుంచి పాలపౌడర్‌, తదితర పాడి ఉత్పత్తుల దిగుమతికి ద్వారాలు తెరవడం ద్వారా మన దేశంలోని పాడి రైతుల ఉపాధి దెబ్బతినే ప్రమాదముంది. దాని అనుబంధ పరిశ్రమలు మూతపడే అకాశముంది. తెలంగాణలో ఆయా సొసైటీల్లో రిజిస్ట్రర్‌ అయిన పాడి రైతుల సంఖ్య 5 లక్షలుం డగా… రిజిస్ట్రర్‌ కాకుండా ఒకటెండ్రు బర్రెలు, ఆవులున్న రైతులు మరో ఐదు లక్షల మంది ఉంటారు. ప్రధానంగా విజయ, మదర్‌ డెయిరీ, ముల్కనూరు, కరీంనగర్‌ డెయిరీలతో పాటు ప్రయివేటులోని హెరిటేజ్‌, జెర్సీ, తిరుమల, మస్కతీ డెయిరీలకు రైతులు పాలు పోస్తు న్నారు. రాష్ట్రంలో ప్రయివేటు డెయిరీలతో క్రమంగా సొసైటీలు ఇప్ప టికే అప్పుల్లోకి కూరుకుపోతున్నాయి. విజయ, మదర్‌డెయిరీ లాంటి సంస్థలు పాల రైతులకు సేకరణకు సంబంధించిన డబ్బులు రెగ్యులర్‌ గా ఇవ్వలేని పరిస్థితి. ఒకటెండ్రు నెలలు పెండింగ్‌లో ఉంటు న్నాయి. అలాంటిది అమెరికా నుంచి పాల ఉత్పత్తులు దిగుమతి అయితే పాలరైతులపై ప్రత్యక్ష ప్రభావం పడనున్నది.

యూఎస్‌లో రైతులు వేల సంఖ్యలో పశువుల తో షెడ్లను నిర్వహి స్తున్నారు. పెద్దఎత్తున దాణా కొనుగోలు చేయడం వల్ల వాళ్లకు తక్కువ రేటుకు లభిస్తున్నది. అక్కడ రైతులకు యూఎస్‌ ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ కూడా ఇస్తున్నది. జన్యుమార్పిడి పంటల నుంచి తయారు చేసిన దాణా వాడటం వల్ల అక్కడ ఉత్పత్తి కూడా ఎక్కువగా వస్తున్నది. ఒక్కో పశువు 50 లీటర్ల వరకు పాలు ఇస్తుంది. దీంతో తక్కువ రేటుకు పాలు ఇచ్చినా వారికి గిట్టుబాటు అవుతుంది. అదే మనదేశంలో ఆవులు 5 నుంచి 20 లీటర్ల పాలను ఇస్తుండగా…బర్రెలు 5 నుంచి 10లీటర్ల మేరకు ఇస్తున్నాయి. దాణా, ఇతరత్రా ఖర్చులు పోను రైతులకు మిగులుతున్నది అంతంతే. మన దేశంలో పశువులకు మన చేన్ల లోని మేతను, ఆర్గానిక్‌ పద్ధతుల్లో తయారు చేసిన దాణానే వాడుతున్నారు. దీంతో పాలు పెద్దగా కలుషితం కావడం లేదు. జన్యు మార్పిడి పంటలను దాణాగా వాడే అమెరికా నుంచి దిగుబడి అయ్యే పాలు ఆరోగ్యానికి మంచికావనే చర్చ నడుస్తున్నది. ఆ పాలు తాగితే అనారోగ్యాలపాలయ్యే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కోట్లాది మంది పాడిరైతులు ఉపాధి కోల్పోయే ప్రమాదం : టి.సాగర్‌, తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి
యూఎస్‌ఏతో చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో మన దేశంలోని కోట్లాది మంది పాడి రైతులు ఉపాధి కోల్పోయే ప్రమాద ముంది. మన దేశంలోని కోట్లాది మంది ప్రజలకు బలవర్ధకమైన ఆహారమైన పాలను అందించడంలో పాల రైతుల తోడ్పాటు మరువ లేనిది. అమెరికా నుంచి పాల పౌడర్‌, పాల ఉత్పత్తుల దిగుమతి పెరి గితే మన దేశంలోని ఉత్పత్తులకు ధరలు పడిపోతాయి. ఇది రైతులకే నష్టంకాదు…ఆ రంగంపై ఆధారపడి నడిచే పరిశ్రమలు కూడా మూత పడే ప్రమాదం పొంచి ఉంది. జన్యుమార్పిడి పంటలు తిన్న పశువుల నుంచి వచ్చే పాలను తాగితే తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే అవకాశ ముంది. మన రైతుల ఉపాధిని దెబ్బతీస్తూ అమెరికా తన మిగులు ఉత్పత్తులు అమ్ముకునేందుకు మోడీ సర్కారు ద్వారాలు తెరవడం సిగ్గు చేటు. దీనికి వ్యతిరేకంగా రైతులంతా పోరాటాల్లోకి రావాలి. దేశ సార్వ భౌమత్వానికి ప్రమాదం పొంచి ఉన్నందున ఈ నెల12న తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -