నవతెలంగాణ-హైదరాబాద్: హిందూత్వ శక్తుల వేధింపుల ఘటనలో ఒక ముస్లిం దుకాణదారుడికి మద్దతుగా నిలబడి, తనను ‘మహ్మద్ దీపక్’గా పరిచయం చేసుకున్న ఉత్తరాఖండ్‌కు చెందిన జిమ్ యజమాని దీపక్ కుమార్‌కు దేశవ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తుతోంది. ఈ జాబితాలో రాజకీయ నాయకులు, సినీ నటులు, సామాజిక కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజలు, నెటిజన్లు కూడా ఉన్నారు. తాజాగా ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ జిమ్ ట్రైనర్ దీపక్ కుమార్‌ను కలుసుకున్నారు. సోమవారం ఆయన నివాసానికి వెళ్లి రాహుల్ మద్దతుగా నిలిచారు.
ఏం జరిగింది..?
గతనెల రిపబ్లిక్‌డే రోజు ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్‌లో నాలుగు దశాబ్దాలుగా నడుస్తున్న ‘బాబా స్కూల్ డ్రస్ అండ్ మ్యాచింగ్ సెంటర్’ అనే దుకాణంపై వీహెచ్‌పీ, బజరంగ్దళ్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారు దుకాణ యజమాని వకీల్ అహ్మద్(71) మతాన్ని ప్రస్తావిస్తూ పేరు మార్చాలని ఒత్తిడి తెచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడికి వచ్చిన దీపక్ కుమార్ కలుగజేసుకున్నాడు. ఆయనకు మద్దతుగా నిలిచాడు. ‘నువ్వు ఎవరు?’ అని ప్రశ్నించిన వీహెచ్‌పీ, బజరంగ్దళ్ కార్యకర్తలకు ‘మేరా నామ్ మహ్మద్ దీపక్’ అని చెప్పాడు. దీంతో దీపక్ చెప్పిన ఆ ఒక్క మాటకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దేశవ్యాప్తంగా దీపక్‌కు మద్దతు పెరిగిపోయింది. నెటిజన్లంతా దీపక్ చర్యను సమర్థిస్తున్నారు. మతోన్మాద హిందూత్వ శక్తులకు ఆయన సరైన సమాధానం చెప్పాడని కొనియాడుతున్నారు.



