Monday, February 23, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్‌ విధానాలను ఖండిస్తూ నోబెల్‌ శాంతి గ్ర‌హీత బ‌హిరంగ లేఖ‌

ట్రంప్‌ విధానాలను ఖండిస్తూ నోబెల్‌ శాంతి గ్ర‌హీత బ‌హిరంగ లేఖ‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధానాలను ఖండిస్తూ నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత అడాల్ఫో పెరెజ్‌ ఎస్క్వివెల్‌ మాజీ అధ్యక్షుడు ఒబామాకు బహిరంగ లేఖ రాశారు. ఈ నెల 12న రాసిన లేఖలో ట్రంప్‌పై విరుచుకుపడ్డారు. ఈలేఖలో ఆయన ట్రంప్‌ను ‘ప్రపంచ నియంత’, ‘నెం1 ఉగ్రవాది’గా అభివర్ణించారు. ట్రంప్‌ చర్యలు ప్రపంచాన్ని అణుయుద్ధమనే అగాధం దిశగా తీసుకువెళుతున్నాయని, అంతర్జాతీయ చట్టంలోని ప్రాథమిక నిబంధనలను సైతం ఉల్లంఘిస్తున్నాయని మండిపడ్డారు.

క్యూబాకి వ్యతిరేకంగా నిర్బంధాన్ని కఠినతరం చేయడాన్ని లేఖలో కీలకంగా ప్రస్తావించారు. చమురు వంటి ముఖ్యమైన సామగ్రి పంపిణీని అడ్డుకోవడం ద్వారా క్యూబాను ఆర్థికంగా దిగ్భంధించేందుకు ట్రంప్‌ యత్నిస్తున్నారని అన్నారు. ఆకలి, ఆయుధాల బలంతో క్యూబా ప్రజలను లంగదీసుకునే ప్రయత్నాన్ని ఆయన ఖండించారు. మరింత నష్టం జరగకుండా నిరోధించడానికి ఒబామా తన పరిపాలనా కాలంలో ప్రారంభించిన చర్చల మార్గానికి తిరిగి రావాలని కోరారు. వెనిజులా గురించి ప్రస్తావిస్తూ.. జనవరి 3న జరిగిన సైనిక దురాక్రమణను తీవ్రంగా ఖండించారు. ఈ చర్యను ప్రత్యక్ష దాడిగా పేర్కొన్నారు. అధ్యక్షుడు మదురో, మొదటి పోరాట యోధురాలు సిలియా ఫోర్స్‌ల కిడ్నాప్‌, చట్టపరమైన హామీ లేకుండా నిర్బంధించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. లాటిన్‌ అమెరికా మరియు కరేబియన్‌ను ‘పీస్‌జోన్‌’గా గుర్తించాలని పిలుపునిచ్చారు.

మధ్యప్రాచ్యంలోని పరిస్థితులను కూడా లేఖలో ఆయన ప్రస్తావించారు. పాలస్తీనా ప్రజలపై జరిగిన మారణహోమంలో ట్రంప్‌కు కూడా భాగస్వామ్యం ఉందని పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు (ఐసిసి) అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసినప్పటికీ .. ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహూ శిక్షించబడకుండా ఉండటాన్ని తప్పుపట్టారు. వలసదారులపై సామూహిక హింస మరియు మెక్సికో, బ్రెజిల్‌, నికరాగ్వా మరియు ఇరాన్‌ దేశాలపై ట్రంప్‌ ఆధిపత్య బెదిరింపులను ఆయన ప్రశ్నించారు. కేవలం సంఘర్షణ లేకపోవడమే శాంతి ఉన్నట్లు కాదని, సామాజిక న్యాయం మరియు సార్వబౌమాధికారాలు గౌరవించబడాలని స్పష్టం చేశారు. ట్రంప్‌ యంత్రాంగం బాధ్యతా రాహిత్యం భౌగోళిక స్థిరత్వాన్ని, అంతర్జాతీయ భద్రతను ప్రమాదంలోకి నెడుతోందని ఆయన హెచ్చరించారు. అమెరికా కాంగ్రెస్‌ను సమీకరించడానికి మరియు నిరంకుశ విధానాలను తిప్పికొట్టడానికి తన చొరవను వినియోగించాలని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాను అభ్యర్థించారు. అర్జెంటీనాలో మానవహక్కుల పరిరక్షణలో చేసిన కృషికి గాను అడాల్ఫో పెరెజ్‌ ఎస్క్వివెల్‌ నోబెల్‌ శాంతి బహుమతిని పొందారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -