Tuesday, February 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజీపీ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి

జీపీ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి

- Advertisement -

– సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట కార్మికుల ధర్నా
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, మల్టీ పర్పస్‌ విధానం రద్దు చేయాలని, పెండింగ్‌ వేతనాలు వెంటనే అందించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ముశం రమేష్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా గ్రామపంచాయతీ కార్మికులకు పని భద్రత కల్పిస్తామని, కనీస వేతనం రూ. 26 వేలు అమలు చేస్తానని, మల్టీ పర్పస్‌ విధానాన్ని రద్దు చేస్తా మంటూ హామీలు గుప్పించిందన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్న రేండ్లు అవుతున్నా గ్రామపంచాయతీ కార్మికుల పట్ల కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య ధోరణి కొనసాగిస్తుందన్నారు.

ఇప్పటికే అనేక దఫాలుగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను కలెక్టర్‌ మొదలుకొని ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్లామని, ప్రతిసారి సమస్యలను పరిష్కరిస్తామంటున్నారే తప్ప పరిష్క రించడం లేదని అన్నారు. కార్మికులకు మూడు, నాలుగు నెలలు వేతనాలు రాకుంటే వారి కుటుంబాలు ఏ విధంగా బతుకుతాయనేది ప్రభుత్వాలు ఆలోచించాలన్నారు. గ్రామపంచాయతీ కార్మికులు ఆరోగ్యాలను సైతం లెక్కచేయకుండా ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు సేవ చేస్తే ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి కనీస వేతనం అమలు చేయాలని, మల్టీపర్పస్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, సూరం పద్మ, గ్రామ పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు బూర శ్రీనివాస్‌, కార్యదర్శి మల్యాల నరసయ్య, సీఐటీయూ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -