నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికాలోని ఈశాన్య ప్రాంతాలపై భారీ మంచు తుపాన్ కురుస్తోంది. మేరీల్యాండ్ నుంచి మెయిన్ వరకు విస్తరించిన ఈ మంచు తుపాను ధాటికి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వాతావరణ శాస్త్రవేత్తలు దీనిని ‘బాంబ్ సైక్లోన్’గా అభివర్ణిస్తున్నారు.విమానయాన రంగంపై ఈ తుపాను ప్రభావం తీవ్రంగా పడింది. దేశవ్యాప్తంగా సోమవారం నాటికి 5,600 విమాన సర్వీసులు రద్దు కాగా, మంగళవారం మరో 2,000 సర్వీసులను నిలిపివేశారు. ముఖ్యంగా న్యూయార్క్, న్యూజెర్సీ, బోస్టన్ విమానాశ్రయాల్లో కార్యకలాపాలు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. రోడ్ ఐలాండ్‌లోని టిఎఫ్ గ్రీన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏకంగా 38 అంగుళాల మంచుతో నిండిపోయింది.
అటు రైలు, బస్సు సర్వీసులు కూడా పాక్షికంగా నిలిపివేయగా, స్టాటన్ ఐలాండ్‌లో రైలు రాకపోకలను అధికారులు పూర్తిగా రద్దు చేశారు. కేప్ కాడ్ తీరంలో గంటకు 133 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు హరికేన్‌ను తలపించాయి. ఈ పెనుగాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఈ మంచు తుపాను బీభత్సం నుంచి సాధారణ స్థితికి వచ్చేందుకు మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది.



