ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్ సంక్షోభం ఐదవ సంవత్సరంలో ప్రవేశించింది. దీనికి బాధ్యులైన నాటో కూటమి దేశాలు ఎలా, ఎప్పుడు ముగింపు పలుకుతాయో తెలియటం లేదు. ట్రంప్ తమ పక్షాన ఉండాలని రష్యా మిలిటరీ చర్యకు నాలుగేండ్లు నిండిన సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మొరపెట్టుకున్నాడు. తమ దేశ స్థితి గురించి అమెరికా టీవీ సిఎన్ఎన్తో సుదీర్ఘంగా మాట్లాడాడు.. ఈ సమయంలో ట్రంప్ తమ పక్షాన ఉండాలని అంటూ అమెరికా పాత్ర ఎంతో ముఖ్యమన్నాడు. ఒక ప్రజాస్వామ్య దేశం ఒక వ్యక్తికి వ్యతిరేకంగా పోరాడుతున్నది, ఎందుకంటే సదరు మనిషి యుద్ధం, పుతిన్ అంటే యుద్ధమే. జరుగుతున్నదంతా అతని గురించే. వారు నిజంగా పుతిన్‌ను నిలువరించదలచుకుంటే అమెరికా ఎంతో పెద్దది ఆపని చేయగలదని చెప్పాడు. పుతిన్ మీద అవసరమైన వత్తిడి ట్రంప్ పెడుతున్నాడా? అన్న ప్రశ్నకు లేదు అన్నాడు. తమ పౌరులు ఈ వివాదంతో అలసిపోయారని,అయితే పుతిన్ డిమాండ్లను ఆమోదించే అవకాశం లేదన్నాడు. తాను కోరుకున్న దంతా ఇవ్వాలని అంటున్నాడు, మేము ఆపని చేస్తే సర్వం కోల్పో తామన్నాడు. మేమంతా దేశం విడిచి పారిపోవాలి లేదా రష్యన్లుగా మారాలన్నాడు.
ఉక్రెయిన్ తాజా సంక్షోభం నిజానికి 2014 నుంచి కొనసాగుతున్నది. తమకు వ్యతిరేకంగా నాటో విస్తరణ పేరుతో ఉక్రెయిన్‌కు సభ్యత్వమిచ్చి తమ ముంగిటకు అణ్వాయుధాలను మోహరించాలన్న అమెరికా ఎత్తుగడలను వమ్ము చేస్తూ గతంలో తన ప్రాంతంగా ఉన్న క్రిమియా ద్వీపాన్ని రష్యా ఆ ఏడాది విలీనం చేసుకుంది.అప్పటి నుంచి ఉక్రెయిన్ పాలకులు రష్యన్లు మెజారిటీగా ఉన్న తమ డాన్బాస్ ప్రాంతంపై దాడులకు మిలిటరీని దించారు. దానికి వ్యతిరేకంగా ఆ ప్రాంతంలో తలెత్తిన తిరుగుబాటుకు రష్యా మద్దతిచ్చింది.సైనిక చర్య ప్రారంభించినప్పటి నుంచి నాలుగేండ్ల కాలంలో 26శాతం ఉక్రెయిన్ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది. మెల్లమెల్లగా కొత్త ప్రాంతాలకు చొచ్చుకుపోతున్నది, విద్యుత్, మంచినీరు వంటి మౌలిక వసతులను దెబ్బతీస్తూ వత్తిడిని తీవ్రతరం చేస్తున్నది. దేశాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. ఉక్రెయిన్ శరణార్ధులను ఎంతకాలం భరించాలనే చర్చ ఇరుగు పొరుగుదేశాలలో మొదలైంది. తమ భద్రతకు హామీల గురించి పట్టుబడుతున్నమాట నిజమే అని, అయితే ఒప్పందం కుదిరిన తరువాత ఒకవేళ పుతిన్ తిరిగి దాడిచేస్తే మా భాగస్వాములు ఏం చేస్తారో తెలుసుకోవాలని తమ పౌరులు అడుగుతున్నారని జెలెన్స్కీ అన్నాడు. రష్యాతో శాంతి ఒప్పందం మీద, ఇతర అంశాలపై అమెరికా, ఐరోపా దేశాలతో ఉక్రెయిన్ ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ చెబుతున్నాడు.తమ ప్రమేయం లేకుండా ఒప్పందాలకు అంగీకరించమని ఐరోపా నేతలు చెబుతున్నారు. తమ భద్రతకు ఇచ్చే హామీల గురించి ముందుగా అమెరికా పార్లమెంటు ఆమోదం తెలిపితేనే తాము ఒప్పందానికి అంగీకరిస్తామని జెలెన్స్కీ చెప్పాడు. అది జరిగితేనే తమ పౌరులకు భరోసా, విశ్వాసం ఏర్పడుతుందని అన్నాడు.గతంలో నాటో దేశాలు ఇచ్చిన అనేక హామీలను పట్టించుకోలేదని కూడా చెప్పాడు.
ఇప్పటివరకు జరిగిన పరిణామాలను సింహావలోకనం చేసుకుంటే చిక్కుముడులు అంత తేలికగా విడిపోయేట్లు లేవు. ఇప్పుడున్న యథాతద స్థితిలో పోరు ముగించటానికి తాము సిద్ధమేనని, అయితే డాన్బాస్ తూర్పు ప్రాంతంలో తమ మిలిటరీ అక్కడే ఉండాలని జెలెన్స్కీ పట్టుబడుతున్నాడు. ఉక్రెయిన్ తిరుగుబాటు ప్రాంతాలకు స్వాతంత్య్రం ఇవ్వాలని, దాని మిలిటరీ బలం, ఆయుధాలను పరిమితం చేయాలని, మరేదేశ మిలిటరీ ఏ రూపంలోనూ ఉక్రెయిన్ గడ్డమీద ఉండకూడదని పుతిన్ పలుమార్లు చెప్పాడు. ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉన్న ప్రాంతం పారిశ్రామికంగా, మిలిటరీ రవాణాకు కీలకమైన రైల్వేలు, రోడ్లు ఈ ప్రాంతంలోనే ఉన్నందున వాటిని వదులుకొనేందుకు పుతిన్ సిద్ధంగా లేడు.తమ దేశాన్ని హారతి పల్లెంలో పెట్టి రష్యాకు ఇవ్వటానికి సిద్ధంగా లేమని జెలెన్స్కీ చెప్పాడు. అతగాడి పదవీ కాలం 2024 మే నెలలోనే ముగిసింది.యుద్ధం కారణంగా అది ముగిసేవరకు తానే పదవిలో ఉంటానని అప్పటివరకు ఎన్నికలు జరిపేది లేదని కూడా చెప్పాడు. ఎన్నికలు జరపాలని, లేకుంటే జెలెన్స్కీని నియంతగా పరిగణిస్తామని గతంలో డోనాల్డ్ ట్రంప్ చెప్పాడు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా ఖండంలో దీర్ఘకాలం సాగిన పోరుగా ఇప్పటికే చరిత్రలో ఉక్రెయిన్ సంక్షోభం నమోదైంది. ఇది ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రపంచం మీద ప్రభావం చూపుతున్నది. ఏ దేశం కూడా ఎదుర్కోని తీవ్రమైన ఆంక్షలను రష్యా మీద నాటో కూటమి దేశాలు అమలు చేస్తున్నాయి. రష్యాతో వాణిజ్య లావాదేవీలు నిర్వహించే భారత్ తదితర దేశాల మీద కూడా అపరాధపన్నుల విధింపు, ఇతర చర్యలు తీసుకుంటామని అమెరికా బెదిరిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటివరకు ఉక్రెయిన్ పోరులో రెండు దేశాలకు జరిగిన నష్టాల గురించి పరస్పరం అతిశయోక్తులు తప్ప నిజానిజాలు వెల్లడి కావటం లేదు. రెండు వైపులా ఇరవైలక్షల మంది సైనికులు గాయపడటం లేదా మరణించి ఉంటారన్నది ఒక అంచనా. పన్నెండున్నరలక్షల మంది రష్యన్లు మరణించినట్లు ఉక్రెయిన్ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే సిఎస్ఐఎస్ అనే సంస్థ 3.25లక్షల మంది మరణించటంతో సహా పన్నెండు లక్షల మంది రష్యా వైపు బాధితులు ఉన్నట్లు చెబుతున్నది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఏ పోరులోనూ ఇంత నష్టం జరగలేదు. మొత్తం పోరులో మరణించిన తమ సైనికులు 55వేల మందే అని జెలెనెస్కీ చెప్పాడు. అయితే సిఎస్ఐఎస్ అంచనా ఉక్రెయిన్‌లో 1.4లక్షల మంది మరణించటంతో సహా గాయపడిన వారిని కలుపుకుంటే ఆరులక్షలని పేర్కొన్నది. అయితే ఇవి నిజమైతే అటు రష్యా, ఇటు ఉక్రెయిన్‌లో వాటికి వ్యతిరేకంగా జనం ఎందుకు వీధుల్లోకి రావటం లేదన్నది ప్రశ్న. నాలుగేండ్లలో 15, 168 మంది సాధారణ ఉక్రెనియన్స్ మరణించారని, 41,534 మంది గాయపడ్డారని ఐరాస మానవహక్కుల సంస్థ చెప్పింది. దాడుల కారణంగా ఉక్రెయిన్ జనాభా 4.2 కోట్ల మందిలో నాలుగో వంతు మంది ఇతర దేశాలకు తరలిపోయినట్లు చెబుతున్నారు. యాభై తొమ్మిది లక్షల మంది దేశాన్ని వదలగా వారిలో 54లక్షల మంది ఐరోపా దేశాలకు వెళ్లారు. రష్యా ఆధీనంలోని ప్రాంతాలలో 50లక్షల మంది నివసిస్తున్నారు. క్రిమియాతో సహా 26శాతం భూ భాగాన్ని ఉక్రెయిన్ కోల్పోయింది. అయితే జెలెన్స్కీ దళాలు తిరిగి స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను తీసి వేస్తే ఆ మొత్తం ఇరవై శాతానికి తగ్గినట్లు మరొక అంచనా.గత మూడేళ్లల్లో పెద్దగా రష్యన్లు ముందుకు పోలేదని మరి కొందరు చెబుతున్నారు. రష్యా సైనిక చర్య ప్రారంభం నుంచి నాలుగేండ్లలో ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయింది. రష్యా ప్రధాన కేంద్రీకరణ మౌలిక సదుపాయాలను నాశనం చేయటం, ఆర్థిక మూలాలను దెబ్బతీయటంపైనే కొనసాగుతున్నది. విద్యుత్ సరఫరా తీవ్రంగా దెబ్బతిన్న కారణంగా ఫ్యాక్టరీలను నడిపేందుకు డీజిల్ జనరేటర్లను వినియోగిస్తున్నా పరిమితంగానే ఉత్పత్తి జరుగుతున్నది. తొలి ఏడాదే 30శాతం పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయింది.ముందే చెప్పుకున్నట్లు 60లక్షల మంది ఇరుగుపొరుగుదేశాలకు వెళ్లగా మరో 30లక్షల మంది అంతర్గతంగా నెలవులు తప్పారు. ఏడాదికేడాది ఆర్థిక పరిస్థితి దిగజారుతున్నది తప్ప స్థిరత్వం కూడా లేదు.విద్యుత్ సరఫరా లేని కారణంగా వృద్ధి రేటు 1.8శాతానికి అటూ ఇటూగా ఉంది. ఈ ఏడాది ఒకశాతంగా ఉంటుందని ఒక సంస్థ జోశ్యం చెప్పింది. దేశ రుణ భారం జిడిపిలో వందశాతానికి చేరింది. శాంతి చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవటంలో రుణ బాండ్ల ధరలు పతనమయ్యాయి.జనంపై పన్నుల పెంపుదల వంటి కొన్ని షరతులకు అంగీకరించిన కారణంగా 810 కోట్ల డాలర్ల రుణం ఇచ్చేందుకు ఐఎంఎఫ్ అంగీకరించింది. దీంతో ఐరోపా యూనియన్ రానున్న రెండు సంవత్సరాల్లో 105 బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు సముఖత వెల్లడించింది.
మిలిటరీ చర్య ప్రారంభించిన తొలి రోజుల్లో పుతిన్ యంత్రాంగం వేసిన అంచనాలు దెబ్బతిన్నాయి. నాటో కూటమి దేశాలు ఉక్రెయిన్‌కు అవసరమైన ఆయుధాలు, ఆర్థిక సాయంతో పాటు రష్యన్ మిలిటరీ కదలికల గురించి కీలకమైన సమాచారాన్ని అందించటంతో తీవ్రమైన ఎదురుదెబ్బలు తగిలాయి. దాంతో వ్యూహం మార్చుకోవాల్సి వచ్చింది. కొన్ని వారాల్లో కీవ్ పతనం అవుతుందన మాస్కో అంచనాలు తప్పాయి. రష్యా కోరిన విధంగా కొంత ప్రాంతాన్ని కోల్పోయి ఒప్పందం చేసుకుంటే సరే లేకపోతే ఉక్రెయిన్ గెలిచే అవకాశాలు లేవని డోనాల్డ్ ట్రంప్ గతేడాది నవంబరులో బహిరంగంగానే చెప్పాడు. గతేడాది ఇరాన్ మీద దాడులు, మరోసారి హెచ్చరికలు, వెనెజులా అధ్యక్షుడిని అపహరించిన డోనాల్డ్ ట్రంప్ రష్యా మీద చర్యకు ఎందుకు వెనకాడుతున్నట్లు అని కొందరు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అధికారానికి వచ్చిన 24 గంటల్లోనే పరిష్కరిస్తానని చెప్పిమాటల ేమైనట్లు అని కూడా అంటున్నారు. రష్యా మీద ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ అవి పనిచేయటం లేదని ట్రంప్‌కు అర్ధమైంది. కొన్ని రాయితీలిచ్చి రష్యాతో కాల్పుల విరమణకు అంగీకరింప చేయిస్తే నవంబరులో జరిగే పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో తన ప్రచారానికి వినియోగించుకోవచ్చని ట్రంప్ యంత్రాంగం ఆలోచించినప్పటికీ పుతిన్ ఏమాత్రం పట్టువీడటం లేదు. ప్రస్తుతం తమ ఆధీనంలో లేని ప్రాంతాలతో సహా మొత్తం తూర్పున ఉన్న డాన్బాస్ మొత్తాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆక్రమించిన దాన్ని వదులుకుంటామని జెలెన్స్కీ సూచించినా పుతిన్ అంగీకరించటం లేదు.జూన్ నాటికి ఏదో ఒక ఒప్పందానికి రావాలని ట్రంప్ కోరిన సంగతి తెలిసిందే, అయితే అలాంటిదేమీ లేదని అధ్యక్ష భవనం తరువాత చెప్పింది. ఒప్పందం కుదిరితే అమెరికాలో 12లక్షల కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెడతామని పుతిన్ ఎరవేసినట్లు జెలెన్స్కీ చెప్పాడు.ఏడాదికి 2.2లక్షల కోట్ల సంపదను కూడా సృష్టించలేని రష్యా అంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతుందంటే ఎవరైనా నమ్ముతారా అంటూ అమెరికన్లు కొట్టిపారవేశారు. నిజానికి రష్యా అర్ధిక స్థితి కూడా అంత సజావుగా లేదు, చైనా, మన దేశం కొనుగోలు చేస్తున్న చమురు పెద్ద ఆసరగా ఉంది. మిలిటరీ చర్య ఐదో ఏడాది ఏ విధంగా సాగనుంది, పరిష్కారానికి నాటో కూటమి అంగీకరిస్తుందా? ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలు!
ఎం కోటేశ్వరరావు
8331013288



