Thursday, February 26, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రాష్ట్రంలోని విద్యావ్యవస్థలో మాతృభాష తెలుగుకు పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భవిష్యత్ తరాలకు తెలుగు భాషా సౌరభాన్ని అందించడమే లక్ష్యంగా, వచ్చే 2026-27 విద్యా సంవత్సరం నుండి రాష్ట్రంలోని అన్ని రకాల పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగును కచ్చితంగా ఒక సబ్జెక్టుగా బోధించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేవలం స్టేట్ బోర్డు పాఠశాలలకే పరిమితం కాకుండా, సీబీఎస్ఈ , ఐసీఎస్ఈ , ఐబీ వంటి అంతర్జాతీయ ప్రమాణాలతో నడిచే ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లోనూ మాతృభాషను కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

ప్రస్తుతం అనేక కార్పొరేట్ పాఠశాలల్లో మార్కుల వేటలో పడి తెలుగును విస్మరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కేవలం స్కోరింగ్ కోసమే అరబిక్, సంస్కృతం వంటి భాషలకు ప్రాధాన్యతనిస్తూ, తెలుగును అటకెక్కిస్తున్న తీరుపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు కనీసం తెలుగులో చిన్న వాక్యాన్ని కూడా సరిగ్గా చదవలేకపోవడం భాషా సంక్షోభానికి దారితీస్తోందని గుర్తించిన సర్కారు, తెలుగు తప్పనిసరి అమలు చట్టం-2018ని కఠినంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. గతంలో కోవిడ్ కారణంగా 9, 10 తరగతులకు ఇచ్చిన మినహాయింపులను రద్దు చేస్తూ, 2025-26లో 9వ తరగతికి, 2026-27 నాటికి 10వ తరగతికి ఈ నిబంధనను వర్తింపజేయనుంది.

అయితే, విద్యార్థులపై పనిభారం పడకుండా ప్రభుత్వం ఒక వినూత్న మార్పును ప్రవేశపెట్టింది. ఇతర బోర్డుల విద్యార్థుల కోసం కఠినమైన ‘సింగిడి’ పుస్తకాలకు బదులుగా, అత్యంత సరళంగా ఉండే ‘వెన్నెల’ పాఠ్యపుస్తకాలను రూపొందించింది. కేవలం ఇతర రాష్ట్రాల నుండి వచ్చి 8వ తరగతి ఆపై తరగతుల్లో చేరే విద్యార్థులకు మాత్రమే ఈ నిబంధన నుండి మినహాయింపు ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించే పాఠశాలలపై భారీ జరిమానాలు విధిస్తామని, చట్టపరమైన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రతి పాఠశాల తగినంత మంది తెలుగు ఉపాధ్యాయులను నియమించుకోవాలని, ఎస్‌సీఈఆర్‌టీ నిర్దేశించిన పుస్తకాలనే బోధించాలని స్పష్టం చేయడంతో, రాష్ట్రవ్యాప్తంగా తెలుగు భాషకు కొత్త ఊపిరి పోసినట్లయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -