నవతెలంగాణ-హైదరాబాద్ : అన్-రెగ్యులేటెడ్ ఛానెల్‌ల ద్వారా విక్రయిస్తున్న అక్రమ హెర్బిసైడ్ టాలరెంట్ బీటీ (HTBt) పత్తి విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ నిపుణులు, విత్తన పరిశ్రమ ప్రతినిధులు పత్తి రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అనధికారిక ఈ విత్తనాలకు మొలకలు వస్తాయనే హామీ మరియు శాస్త్రీయ ధృవీకరణ ఉండదు. దీనివల్ల తరచు సాగుదారులు అస్థిరమైన పంట దిగుబడిని మరియు ఊహించని ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ప్రభావిత ప్రాంతాల నుండి అందిన క్షేత్ర స్థాయి నివేదికల ప్రకారం, వాతావరణ మార్పులు, తెగుళ్ల ఉధృతి, నియంత్రణ లేని విత్తనాలను వాడటం వంటి కారణాల వల్ల కొన్ని సీజన్లలో దిగుబడి 10–15 క్వింటాళ్ల నుండి 4–6 క్వింటాళ్లకు పడిపోయిందని సాగుదారులు గమనించారు.
విదర్భకు చెందిన ఒక పత్తి రైతు తన కష్టాలను పంచుకుంటూ, పత్తి విత్తనాలు మొదట్లో తక్కువ ధరకు దొరికినట్లు అనిపించిందని చెప్పారు. “ఆ విత్తనాలతో పంట సరిగ్గా పెరగలేదు. దిగుబడి బాగా తగ్గిపోయింది. నష్టం జరిగినప్పుడు బాధ్యత వహించేవారు ఎవరూ లేరు” అని వాపోయారు.
అక్రమ HTBt విత్తనాల వాడకం గ్లైఫోసేట్‌పై(glyphosate) ఆధారపడటాన్ని మరింత పెంచింది. కలుపు మందును తట్టుకునే శక్తి విత్తనాలకు ఉండటంతో, రైతులు పదేపదే మందును పిచికారీ చేస్తున్నారు. దీనివల్ల పెట్టుబడి ఖర్చులు పెరగడమే కాకుండా, కలుపు మందులకు లొంగని “మొండి కలుపు మొక్కలు” (monster weeds) పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది. ఇది క్రమంగా నేల స్వభావాన్ని దెబ్బతీస్తూ, దీర్ఘకాలిక ఉత్పాదకతను తగ్గిస్తుంది. కలుపును సమర్థవంతంగా నివారించడానికి మరియు నేల ఆరోగ్యాన్ని కాపాడటానికి, కేవలం కలుపు మందులపైనే ఆధారపడకుండా సాగు పద్ధతులు, యాంత్రీకరణ మరియు వివిధ రకాల నివారణ చర్యలతో కూడిన ‘సమగ్ర కలుపు యాజమాన్యం’ (IWM) పాటించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు, విధాన నిపుణులు సూచిస్తున్నారు.
రాశి సీడ్స్(Rai Seeds) ఛైర్మన్ డాక్టర్ ఎం.రామసామి మాట్లాడుతూ, అక్రమ HTBt పత్తి విత్తనాలు వేగంగా విస్తరిస్తుండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “అదుపులేని ఈ సీడ్స్ విస్తరణ వల్ల దిగుబడులు తగ్గి, పీచు నాణ్యత దెబ్బతిని రైతులు నష్టపోతున్నారు. అంతేకాకుండా, గత నాలుగు ఐదు దశాబ్దాలుగా నిర్మించుకున్న విత్తన సరఫరా వ్యవస్థను కూడా ఇది అస్థిరపరుస్తోంది. ఈ అక్రమ విత్తనాల అమ్మకాలను అరికట్టడానికి వెంటనే కఠినమైన చర్యలు తీసుకోకపోతే, విత్తన పరిశోధనలు మరియు అధునాతన సాంకేతికతలపై భవిష్యత్తులో జరిగే పెట్టుబడులకు తీవ్ర ఆటంకం కలుగుతుంది,” అని ఆందోళన వ్యక్తం చేశారు.
గోద్రెజ్ ఆగ్రోవెట్‌తో సహా రైతులతో కలిసి పనిచేసే సంస్థలు, అవగాహనతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం ఎంత ముఖ్యమో నొక్కి చెబుతున్నాయి. గోద్రెజ్ ఆగ్రోవెట్ క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్ సీఈఓ ఎన్.కె. రాజవేలు మాట్లాడుతూ, “కేవలం కలుపు మందులపైనే ఆధారపడకుండా, సమగ్ర కలుపు యాజమాన్యాన్ని (Integrated Weed Management) పాటించడం వల్ల స్థిరమైన దిగుబడులు రావడమే కాకుండా, కాలక్రమేణా నేల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది” అని పేర్కొన్నారు.
అక్రమ పత్తి విత్తనాల వల్ల ఎదురయ్యే నష్టాల దృష్ట్యా, రైతులు కేవలం గుర్తింపు పొందిన కంపెనీల బ్రాండెడ్ విత్తనాలను మాత్రమే ఎంచుకోవాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎటువంటి బాధ్యత లేదా హామీ ఇవ్వని సంస్థలు లేద తెలియని వ్యక్తుల నుండి కాకుండా, కేవలం రిజిస్టర్డ్, లైసెన్స్ పొందిన డీలర్ల వద్దే విత్తనాలను కొనుగోలు చేయాలని వారు కోరుతున్నారు. రేపటి దిగుబడులను కాపాడుకోవడానికి, పత్తి సాగు వ్యవస్థను సుస్థిరంగా ఉంచుకోవడానికి ఇవాళ మంచి వంగడాలను ఎంచుకోవడం చాలా అవసరం.


