నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఇటీవల నిజామాబాద్ మేయర్గా ఎన్నికైన ఉమారాణి నీ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి, గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్ల రాజు, పట్టణ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు హాజరయ్యారు. పార్టీ నాయకులు ఉమారాణి కి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ..నిజామాబాద్ మేయర్గా ఉమారాణి విజయం మహిళా శక్తికి ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని బాధ్యతలు స్వీకరించిన ఆమె అభివృద్ధి, పారదర్శక పాలనకు కట్టుబడి పనిచేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం రోజురోజుకు పెరుగుతోందని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తే ప్రజల ఆదరణ ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు. గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, ఉమారాణి నాయకత్వంలో నిజామాబాద్ పట్టణం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సంకల్పించారు.



