నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో అర్హులైన పేదలకు ప్రభుత్వ భూమిలో ఇంటి స్థలాలు కేటాయించాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తూ గుడిసెలు వేసుకుని భూమిపై నివాసం ఏర్పరచుకున్నారు. సర్వే నంబర్ 8లో ఉన్న ప్రభుత్వ భూమిలో ప్రారంభమైన ఈ గుడిసెల పోరాటం ఈరోజుతో నాలుగో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చెక్క వెంకటేష్ మాట్లాడుతూ అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు కేటాయించే వరకు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని తెలిపారు.గత ఒక సంవత్సరం నుంచి భూ అక్రమాలపై నిరంతర పోరాటాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పేదల పక్షాన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని విమర్శించారు.
పేదల నివాస హక్కును ప్రభుత్వం వెంటనే గుర్తించి సర్వే నంబర్ 8లో ఉన్న భూమిని అర్హులైన వారికి కేటాయించాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి పొన్నబోయిన రవి,తెలంగాణ ప్రజా నాట్య మండలి జిల్లా ఉపాధ్యక్షులు పోతు ప్రవీణ్, సిపిఐ నాయకులు యాట ఉపేందర్, సంపత్, పార్వతి, అర్జున్, సుశీల, నర్ర సరిత, యాదమ్మ, క్రాంతి కుమార్,సంధ్య తదితరులు పాల్గొన్నారు.



