నవతెలంగాణ-హైదరాబాద్ : బాచుపల్లి – మియాపూర్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సమీపంలో ఉన్న ఫర్నిచర్ షాపుల సముదాయంలో మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కేజీఆర్ కన్వెన్షన్‌కు ఆనుకుని ఉన్న వరుస షాపుల్లో మంటలు ఒక్కసారిగా ఎగసిపడడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. రెండు షాపుల్లో ప్రారంభమైన ఈ మంటలు క్షణాల్లోనే పక్కపక్కన ఉన్న దాదాపు 50కి పైగా ఫర్నిచర్ దుకాణాలకు వ్యాపించాయి. దీనితో రోడ్డు పక్కన ఫుట్‌పాత్ లపై ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లలో పెద్ద ఎత్తున ఫర్నిచర్ నిల్వ ఉండటం వల్ల మంటలు వేగంగా విస్తరించాయి. ముందుభాగంలో విక్రయాలు జరుపుతూ.. వెనుక భాగంలో గోదాములుగా నిల్వలు ఉంచడం అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లయింది.
సమాచారం అందుకున్న వెంటనే ఐదు డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు, హైడ్రా సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. దాదాపు 10 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమించారు అధికారులు. భారీ ఫర్నిచర్ సామాగ్రి, కలప, ఫోమ్ వంటి దహన పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల అగ్ని మాపక సిబ్బందికి మంటలను నియంత్రించడం సవాలుగా మారింది. ఈ అగ్నిప్రమాదంలో కోట్ల రూపాయల విలువైన ఫర్నిచర్ దగ్ధమైనట్లు అంచనా. ఫుట్‌పాత్‌పై వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే చిరు వ్యాపారులు తమ ఆస్తి కళ్లముందే బూడిదవుతుండటంతో ఆవేదన వ్యక్తం చేశారు.



