Wednesday, March 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే రమణారెడ్డి ఒక ‘అవినీతి చక్రవర్తి’

ఎమ్మెల్యే రమణారెడ్డి ఒక ‘అవినీతి చక్రవర్తి’

- Advertisement -

– ప్రాణహాని తలపెట్టి సానుభూతి డ్రామాలాడుతున్నారు –  గీరెడ్డి మహేందర్ రెడ్డి 
నవతెలంగాణ – కామారెడ్డి 

కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి రాజకీయ ముసుగులో సాగిస్తున్న అరాచకాలు, అవినీతి దందాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గీరెడ్డి మహేందర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తన అవినీతి సామ్రాజ్యం కూలిపోతుందనే భయంతోనే రమణారెడ్డి తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.

‘పంచలోహాల’ నుండి ‘కేబుల్ మాఫియా’ వరకు.. అంతా అవినీతే! రమణారెడ్డి కేవలం ఒక ఎమ్మెల్యే కాదు, ఆయనో పెద్ద అవినీతి తిమింగలం అని మహేందర్ రెడ్డి విమర్శించారు. కాలేజీ భూముల కబ్జా మాత్రమే కాదు, రైస్ పుల్లింగ్, పంచలోహ విగ్రహాల స్మగ్లింగ్, కేబుల్ మాఫియా, భూ దందాల్లో కూడా ఆయన హస్తం ఉందని ఆరోపించారు. ఇన్నాళ్లూ ఆయన అక్రమాలతో ఇబ్బంది పడ్డ బాధితులు ఇప్పుడు ధైర్యంగా బయటకు వస్తున్నారని, ఈ పాపాలు ఎక్కడ బట్టబయలు అవుతాయో అన్న భయం రమణారెడ్డిలో మొదలైందని ఎద్దేవా చేశారు. గూండాలతో దాడి చేయించి.. బాధితుడినే నిందితుడిగా మార్చారన్నారు.

ఎమ్మెల్యే రమణారెడ్డి, 8వ వార్డు కౌన్సిలర్ ఏనుగు శ్రీధర్ రెడ్డి తనను పలుమార్లు ఫోన్ చేసి పిలిపించారని మహేందర్ రెడ్డి వెల్లడించారు. కామారెడ్డి అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దామని పిలిచారని, మధ్యవర్తిగా వెళ్లిన తనపై వందలాది మంది బీజేపీ కార్యకర్తలతో దాడి చేయించారని ఆరోపించారు. “65 ఏళ్ల వయసున్న నేను ఒక్కడినే వందలాది మంది ఉన్న చోటికి దాడికి వెళ్తానా? ఇది ముందస్తు పథకం ప్రకారం రమణారెడ్డి ఆడిన డ్రామా” అని పేర్కొన్నారు.

దమ్ముంటే గుడిలో ప్రమాణం చేద్దాం తాను దాడి కోసం వెళ్లలేదని పచ్చిబట్టలతో గుడిలో ప్రమాణం చేయడానికి సిద్ధమని, తనను పిలవలేదని రమణారెడ్డి, శ్రీధర్ రెడ్డి ప్రమాణం చేయగలరా? అని సవాల్ విసిరారు. రమణారెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన ఘటనలో తన వెంట ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఉన్నా, ఇంద్రచౌక్ నుండి రమణారెడ్డి ఇంటి వరకు ముక్కు నేలకు రాస్తానని అన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ‘హత్యాయత్నం’ డ్రామా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన రమణారెడ్డి, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికే ‘హత్యాయత్నం’ డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. గతంలో విద్యార్థి ఉద్యమాల సమయంలో రమణారెడ్డి కుటుంబాన్ని కాపాడింది షబ్బీర్ అలీ గారని గుర్తు చేశారు. ఇంతటి దిగజారుడు రాజకీయాలు చేస్తారని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తనకు ప్రాణహాని ఉందని, పోలీసుల రక్షణ కల్పించాలని మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. తన కారును ధ్వంసం చేసి, నాపైనే అక్రమ కేసులు పెట్టడం రమణారెడ్డి అహంకారానికి నిదర్శనమని ఆరోపించారు. ఈ కేసులపై న్యాయపోరాటం చేస్తానని, రమణారెడ్డి నిజస్వరూపం బయటపెట్టే వరకు విశ్రాంతి తీసుకోనని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పండ్లరాజు, గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, కామారెడ్డి మండల అధ్యక్షులు గూడెం శ్రీనివాస్ రెడ్డి, బిక్నూర్ మండల అధ్యక్షులు భీమ్ రెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు ఐరేణి సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -