అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలి
లేనియెడల సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళన
సీపీఐ(ఎం) మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు
నవతెలంగాణ – బోనకల్
మార్క్ ఫెడ్ ద్వారా వెంటనే మధిర నియోజకవర్గ వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, అకాల వర్షాల వలన దెబ్బతన్న మొక్కజొన్న రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని సీపీఐ(ఎం) మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లోని బోనకల్ మండల కేంద్రంలో గల వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సమావేశం బంధం శ్రీనివాసరావు అధ్యక్షతన బుధవారం జరిగింది.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన అకాల వర్షాల వలన మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. మధిర నియోజకవర్గ వ్యాప్తంగా మొక్కజొన్న పంట చేతికి వచ్చిందన్నారు. పది రోజుల క్రితం వరకు రూ. 2600 వరకు కొనుగోలు చేశారని తెలిపారు. ప్రైవేటు వ్యాపారులు రంగంలోకి దిగి ప్రస్తుతం రూ. 1500 నుంచి రూ. 1600 లకే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. దీని వలన కూడా రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా మద్దతు ధర రూ. 2400 మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసలే అకాల వర్షాలు వలన చాలామంది రైతులు తీవ్రంగా నష్టపోయరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారులు ఇష్టానుసారంగా కొనుగోలు చేస్తున్నారని, ప్రభుత్వమే మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయటం వలన ఎంతో కొంత రైతులకు లాభం చేకూరుతుందన్నారు.
మధిర నియోజకవర్గ వ్యాప్తంగా అనేక గ్రామాలలో మొక్కజొన్న పంట చేతికి వచ్చిందన్నారు. ఎకరానికి ఒక్కొక్క రైతు రూ. 30 వేల వరకు, కౌలు రైతులు ఎకరానికి కౌలు, పెట్టుబడి కలిపి రూ. 50 వేల వరకు పెట్టుబడి పెట్టినట్టు తెలిపారు. అకాల వర్షాల వలన నేలమట్టమైన మొక్కజొన్న రైతులకు ఈ ఏడాది తీవ్ర నష్టం జరిగిందన్నారు. ఈ ఏడాది వానాకాలంలో సాగుచేసిన పత్తి పంట అకాల వర్షాలు వల్లే పూర్తిగా దెబ్బతిని రైతులు దారుణంగా నష్టపోయారు అన్నారు. పత్తి పంట వలన నష్టపోయిన అన్నదాతలు మొక్కజొన్న పంట సాగు చేశారని అది కూడా అకాల వర్షాలు దెబ్బతిన్నది అన్నారు.ఈ ఏడాది అకాల వర్షాలు రైతులకు కన్నీటి కడగండ్లు మిగిల్చాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రకృతి వైపరీత్యము వలన నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాల్సిన బాధ్యత లేదా అని ఆయన ప్రశ్నించారు. ఒకవైపు తమది రైతు ప్రభుత్వం అని పదేపదే చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం అకాల వర్షాల వలన దెబ్బతిన్న రైతులను ఎందుకు ఆదుకోవడం లేదో ప్రభుత్వం రైతులకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మార్క్ఫెడ్ ద్వారా వెంటనే మధిర నియోజకవర్గ వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, లేనియెడల సిపిఎం ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు.
నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు లక్ష ఎకరాలలో మొక్కజొన్న పంట సాగు చేశారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా సీనియర్ నాయకులు చింతలచెరువు కోటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు దొండపాటి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కిలారు సురేష్, మండల కమిటీ సభ్యులు గుగులోత్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.



