నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్లో జేడీయూ మనుగడ సాధించదని.. ఆ పార్టీ శకం ముగిసిందని తేజస్వి యాదవ్ ఆరోపించారు. నితీష్ కుమార్ను బీజేపీ హైజాక్ చేసిందని.. మిత్రులను తినేస్తోందని వ్యాఖ్యానించారు. ఓబీసీ లేదా అత్యంత వెనుకబడిన తరగతులకు చెందిన నాయకుడు ముఖ్యమంత్రి కావడం బీజేపీకి ఇష్టం లేదన్నారు. ప్రస్తుత పరిణామాలు ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ను ముఖ్యమంత్రిగా ఉండనివ్వదని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని పేర్కొన్నారు.
‘‘మహారాష్ట్రలో ఏం జరిగింది? తొలుత ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత బీజేపీ హైజాక్ చేయలేదా? ఇప్పుడు బీహార్లో కూడా అదే జరిగింది. జేడీయూలోని కొంత మంది బీజేపీతో కుమ్మక్కయ్యారు. అందుకే ఇంత వేగంగా పరిణామాలు మారిపోయాయి.’’ అని తేజస్వి యాదవ్ చెప్పుకొచ్చారు. రాజ్యసభ ఎన్నికల వేళ అనూహ్యంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభకు వెళ్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.



