నవతెలంగాణ కరీంనగర్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లో కరీంనగర్ కు చెందిన డాక్టర్ పొన్నం రవిచంద్ర డాక్యుమెంటరీ విభాగంలో పురస్కారాన్ని పొందారు. ఈరోజు హైదరాబాదులో విలేకర్ల సమావేశంలో 2025 తెలుగు సినిమాల వివిధ విభాగాలకు సంబంధించిన అవార్డులను ప్రకటించారు. డాక్యుమెంటరీ విభాగానికి సంబంధించి తెలంగాణ ముద్దుబిడ్డ బాలీవుడ్ లో 300కు పైగా సినిమాలలో నటించి, నిర్మించి దర్శకత్వం వహించిన పైడి జయరాజ్ జీవన చిత్రంపై డాక్టర్ పొన్నం రవిచంద్ర రూపొందించిన “ద ఫస్ట్ యాక్షన్ హీరో” డాక్యుమెంటరీ రెండవ అత్యుత్తమ డాక్యుమెంటరీగా అవార్డు గెలుచుకుంది.
డాక్టర్ పొన్నం రవిచంద్ర సీనియర్ జర్నలిస్టుగా,కవిగా, రచయితగా,డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాతగా, సినీ నిర్మాతగా తనదైన ముద్ర వేసిన సృజనశీలి. కరీంనగర్ ఫిలిం భవన్ కు కరీంనగర్ ఫిలిం సొసైటీ కి గత 8 ఏళ్ళ నుంచి అధ్యక్షుడిగా సినీ రంగ వికాసం కోసం, అత్యుత్తమ సినిమాల ప్రదర్శన ద్వారా యువతలో సినిమా కళ పట్ల ఆసక్తిని కలిగించే దిశగా వారు ఎంతో కృషి చేస్తున్నారు. ఆ క్రమంలోనే పైడి జయరాజ్ గారి జీవన ఇతివృత్తంతో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి లక్షల రూపాయల వ్యయంతో ఈ డాక్యుమెంటరీని ఆయన రూపొందించారు. దీనికోసం ముంబైకి వెళ్లి పైడి జయరాజ్ గారి వారసులతో సంప్రదించి అరుదైన ఫోటోగ్రాఫ్ లను, వీడియోలని సేకరించి ఈ అరుదైన అపూర్వమైన డాక్యుమెంటరీని ఆయన రూపొందించడం విశేషం. దీనివల్ల తెలుగు ప్రపంచానికి తెలంగాణ సినీ ప్రేమికులకు పైడి జయరాజ్ గురించిన ఎన్నెన్నో విశేషాలు వెలుగులోకి రావడానికి, తెలంగాణ జాతి ఖ్యాతి సినీరంగంలో ఎదిగిన తీరుకు ఈ డాక్యుమెంటరీ అద్దం పట్టిందని, డాక్టర్ పొన్నం రవిచంద్రకు ప్రతిష్టాత్మక తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డు డాక్యుమెంటరీ విభాగంలో రావడం ఆనందదాయకమని కరీంనగర్ జిల్లాకు కవులు రచయితలు సినిమా ప్రేమికులు నలిమెల భాస్కర్ , పి.ఎస్.రవీంద్ర, నగునూరి శేఖర్, గాజోజు నాగభూషణం, మాడిశెట్టి గోపాల్, అనంత చార్య,కూకట్ల తిరుపతి, కందుకూరి అంజయ్య, బూర్ల వెంకటేశ్వర్లు, లక్ష్మీ గౌతమ్, అనిల్, వరాల మహేష్ , ముజఫర్, కోలా రామచంద్ర రెడ్డి, అశోక్ రావు, పురుషోత్తం సతీష్, శంకరయ్య, మాడుగుల రాములు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకు సంబంధించిన పలు సాహిత్య, సాంస్కృతిక, కళా సంఘాల బాధ్యులు హర్షం వ్యక్తం చేశారు.



