నవతెలంగాణ-హైదరాబాద్: బోర్డు పరీక్షల్లో విద్యార్థులకు చాట్‌జిపిటి సాయంతో ఎగ్జామినేషన్ సిబ్బంది సాయం చేశారు. దీంతో మాస్ కాపీయింగ్‌కు సహకరించినందుకుగానూ జిల్లా వ్యాప్తంగా 81 మంది సిబ్బందిని అక్కడి ప్రభుత్వ అధికారులు సస్పెండ్ చేసిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. ఇటీవల మహారాష్ట్రలో నిర్వహించిన 10, 12వ తరగతి పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు పలు ఫిర్యాదులు అందాయని మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేపట్టగా బీడ్ జిల్లాలోని పలు పాఠశాలల్లో విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడినట్లు గుర్తించామన్నారు.
పరీక్షలు జరిగిన సమయంలో ఎగ్జామినేషన్ సిబ్బంది చాట్‌జిపిటి లో చూసి, విద్యార్థులకు సమాధానాలు చెప్పినట్లు ప్రాథమిక దర్యాప్తులో నిర్థారణ అయ్యిందని అధికారులు వివరించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేసినందుకు సదరు టీచర్లపై కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. మాస్ కాపీయింగ్‌కు సహకరించినందుకుగానూ జిల్లా వ్యాప్తంగా 81 మంది సిబ్బందిని సస్పెండ్ చేశామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నిరోధించడానికి, బోర్డు పరీక్షల సమగ్రతను కాపాడటానికి ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టామని అధికారులు తెలిపారు.



