నల్ల జెండాలు చూపుతూ గోబ్యాక్ నినాదాలు చేసిన నిరసనకారులు
పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఘటన
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు కోల్‌కతా వచ్చిన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)కు నిరసనలు ఎదురయ్యాయి. సోమవారం కాలీఘాట్ ఆలయాన్ని సందర్శించిన సమయంలో కొందరు నల్ల జెండాలు చూపిస్తూ నిరసన తెలియజేశారు. ఆయనకు వ్యతిరేకంగా ‘గోబ్యాక్’ నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు. అయితే అక్కడ ఉన్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వివరాళ్లోకెళ్తే.. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలను సమీక్షించేందుకు సీఈసీ జ్ఞానేశ్ కుమార్.. కోల్‌కతాకు వెళ్లారు. ఎన్నికల కమిషన్ పూర్తి బృందంతో కలిసి రెండు రోజులు ఆయన పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన కాలీఘాట్ కాళీ ఆలయాన్ని సందర్శించారు. ఆ ఆలయం రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసానికి సమీపంలోనే ఉంది. అయితే ఆలయం బయట కొందరు నిరసనకారులు నల్ల జెండాలు ప్రదర్శిస్తూ ‘గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ఆయన ఫొటోలు, గో బ్యాక్ నినాదంతో ఉన్న ప్లకార్డులను వారు ప్రదర్శించారు. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా ఈ నిరసనల వెనుక తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఉందని బీజేపీ ఆరోపించింది. మరోవైపు నిరసనకారులు కోల్‌కతా విమానాశ్రయం దగ్గర కూడా ఎన్నికల కమిషన్ అధికారులకు వ్యతిరేకంగా ‘గో బ్యాక్’ నినాదాలతో నిరసన తెలిపారు. ఎన్నికల కమిషన్ బృందం ఈ పర్యటనలో కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులతో సమావేశమై ఎన్నికల భద్రతా ఏర్పాట్లను సమీక్షించనుంది. అలాగే ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కూడా సమావేశం కానుంది.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు చేదు అనుభవం
- Advertisement -
- Advertisement -



