నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా రాజకీయాల్లో వివాదాలకు కేంద్రంగా నిలిచిన నాయకులపై వ్యంగ్యంగా రూపొందించిన శిల్పం వాషింగ్టన్ నేషనల్ లో చర్చనీయాంశమైంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరియు లైంగిక వేధింపుల కేసులో దోషిగా నిర్ధారించబడి జైలులో మరణించిన వ్యాపారవేత్త జెఫ్రీ ఎప్స్టీన్ ను కలిపి రూపొందించిన ఈ నిరసన శిల్పం ప్రస్తుతం వాషింగ్టన్ డిసిలో పెద్ద చర్చకు దారితీసింది. టైటానిక్ చిత్రంలో జాక్–రోజ్ పాత్రలను గుర్తు చేసే భంగిమలో ఈ శిల్పాన్ని రూపొందించారు. ‘సీక్రెట్ హ్యాండ్‌షేక్’ అనే కళాకారుల బృందం ఈ శిల్పాన్ని తయారు చేసినట్లు తెలిపింది. అధికార వర్గాల్లోని అనైతిక సంబంధాలు, రాజకీయ వ్యవస్థలోని విరుద్ధతలను వ్యంగ్యంగా చూపించడమే తమ ఉద్దేశమని వారు పేర్కొన్నారు.
ఇటీవల ఎప్‌స్టిన్‌కు సంబంధించిన పత్రాలను విడుదల చేస్తామని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో అమెరికా న్యాయశాఖ కొన్ని ఫైళ్లను బహిర్గతం చేసింది. అందులో కొన్ని సంచలన ఆరోపణలు ఉన్నాయని అమెరికా మీడియా పేర్కొంది. 1980లలో ఎప్స్టీన్ ద్వారా ట్రంప్‌ను కలిసిన ఒక మహిళ, తనపై వేధింపులకు ప్రయత్నించారని ఆరోపించినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలను వైట్ హౌస్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ ఖండిస్తూ, అవి నిరాధారమైనవని, రాజకీయ ప్రేరణతో వచ్చినవని పేర్కొన్నారు.
ఇక ఈ పత్రాల విడుదలలో ఆలస్యంపై అమెరికా కాంగ్రెస్‌లోని ఒక కమిటీ అటార్నీ జనరల్ పామ్ బోండి పాత్రపై విచారణ ప్రారంభించినట్లు సమాచారం. ట్రంప్ ఎప్స్టీన్‌తో సంబంధాలున్నాయన్న ఆరోపణలను తిరస్కరించినప్పటికీ, ఈ శిల్పం లేవనెత్తిన ప్రశ్నలు వాషింగ్టన్ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారి తీస్తున్నాయి.



