Thursday, March 12, 2026
E-PAPER
Homeజిల్లాలుపదో తరగతి పరీక్షలకు పక్కా ఏర్పాట్లు!

పదో తరగతి పరీక్షలకు పక్కా ఏర్పాట్లు!

- Advertisement -

• విద్యార్థులు ధైర్యంగా పరీక్షలు రాయాలి

• రేపటి నుండి ఏప్రిల్ 13 వరకు పరీక్షలు

• నిమిషం నిబంధన లేదు…సెల్ ఫోన్ నిషేధం

• అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి

• ‘నవతెలంగాణతో ఎంఈవో శ్రీనివాస్

నవతెలంగాణ పెద్దవంగర

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు పరీక్షలకు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో) బుధారపు శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా నవతెలంగాణ’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరీక్షల ఏర్పాట్లు, విద్యార్థులకు సూచనలు తదితర అంశాలను ఎంఈవో వెల్లడించారు.

ఎంఈవో: మండలంలోని ఐదు ఉన్నత పాఠశాలలతో పాటుగా, కేజీబీవీ, ఎంజేపీ మొత్తం 7 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఎంజేపీ విద్యార్థులు 66 మంది తొర్రూరు లోనే పరీక్షలు రాయనున్నారు. పెద్దవంగర 57, అవుతాపురం 33, వడ్డెకొత్తపల్లి 15, బొమ్మకల్ 11, చిట్యాల 29, కేజీబీవీ 39 మొత్తం 184 మంది విద్యార్థులు పెద్దవంగర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో పరీక్షలు రాయనున్నారు.

ఎంఈవో: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశాం. పదో తరగతి పబ్లిక్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశాం. పరీక్షా హాళ్లలో విద్యార్థులు సౌకర్యంగా కూర్చునేలా ఫర్నిచర్ ఏర్పాటు చేశాం. తాగునీరు, విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్లు, ఫ్యాన్లు వంటి మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చూసాం. పరీక్షా కేంద్రాల్లో పరిశుభ్రతకు ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నాం. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాయాలనే లక్ష్యంతో అన్ని ఏర్పాట్లు పక్కాగా చేశాం.

ఎంఈవో: పరీక్షల్లో కాపీయింగ్, చూచిరాతలు వంటి అక్రమాలకు ఎలాంటి అవకాశమూ ఇవ్వం. ఇందుకోసం ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు నిరంతరం పరీక్షా కేంద్రాలను తనిఖీ చేస్తాయి. పరీక్ష కేంద్రం పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేయడం జరుగుతుంది. అనుమానాస్పద వ్యక్తులను కేంద్రాల దగ్గరకు రానివ్వకుండా పోలీసులు పర్యవేక్షణ చేస్తారు. పరీక్షలు పూర్తిగా పారదర్శకంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం.

ఎంఈవో: విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, ప్రథమ చికిత్స (ఫస్ట్ ఎయిడ్), అవసరమైన వైద్య సహాయం అందుబాటులో ఉంచుతున్నాం. వేడి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. విద్యుత్ అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేశాం. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని చర్యలు చేపట్టాం.

ఎంఈవో: విద్యార్థులు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలి. హాల్ టికెట్ తప్పనిసరిగా వెంట తీసుకురావాలి. పరీక్ష ప్రారంభానికి కనీసం అరగంట ముందే కేంద్రానికి చేరుకోవాలి. పుస్తకాలు, మొబైల్ ఫోన్లు లేదా ఇతర అనుమతిలేని వస్తువులు పరీక్షా కేంద్రానికి తీసుకురాకూడదు. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుని ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదివిన తర్వాతనే సమాధానాలు రాయాలి.

ఎంఈవో: తల్లిదండ్రులు పిల్లలపై అనవసర ఒత్తిడి చేయకుండా ప్రోత్సహించాలి. పరీక్షల సమయంలో వారికి ధైర్యం చెప్పాలి. పిల్లలు ప్రశాంతంగా చదివి పరీక్షలు రాయేలా ఇంట్లో అనుకూల వాతావరణం కల్పించాలి. సమయానికి పరీక్షా కేంద్రానికి పంపించాలి.

ఎంఈవో: విద్యార్థుల భవిష్యత్తుకు పదో తరగతి పరీక్షలు చాలా కీలకం. అందుకే పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో చర్యలు తీసుకున్నాం. విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని కోరుకుంటున్నాను. పదో తరగతి విద్యార్థులకు బెస్ట్ ఆఫ్ లక్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -