Thursday, March 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాలు, పట్టణాల అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు ముందుండాలి

గ్రామాలు, పట్టణాల అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు ముందుండాలి

- Advertisement -

– ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచులు, కౌన్సిలర్లకు శిక్షణ
– 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలి
– గ్రామాలను మోడల్ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దాలి
–   ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
నవతెలంగాణ – కామారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక”లో భాగంగా రూపొందించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై సర్పంచులు, మున్సిపల్ చైర్‌పర్సన్‌లు, కౌన్సిలర్లకు అవగాహన కల్పించేందుకు గురువారం కామారెడ్డి కళాభారతి వేదికగా ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ లు ముఖ్య అతిథులుగా పాల్గొని దిశానిర్దేశం చేశారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు అమలు చేయనున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించగా, అనంతరం “జయ జయ హే తెలంగాణ” గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేయాలని తెలిపారు. ప్రభుత్వం రూపొందించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో స్థానిక ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. గ్రామ పంచాయతీలపై పూర్తి అవగాహనతో 10 థీమ్‌ల ఆధారంగా గ్రామాలను మోడల్ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా ఉండాలని కలెక్టర్ సూచించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పచ్చదనం పెంపు, పారిశుధ్యం, తాగునీటి సదుపాయం, విద్యా మరియు ఆరోగ్య సేవల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. అభివృద్ధి పనులను పారదర్శకంగా అమలు చేసి గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని సర్పంచులు, కౌన్సిలర్లకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడంతో పాటు గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధి కోసం “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక” కింద 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోందన్నారు.

ప్రభుత్వ పథకాలు ప్రజలకు సమర్థవంతంగా చేరాలంటే గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రణాళికలో భాగంగా మౌలిక వసతులు, తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థలు, రోడ్డు భద్రత, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, సమస్యలను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధిలో సర్పంచులు, మున్సిపల్ చైర్‌పర్సన్‌లు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. గ్రామాల అభివృద్ధి, పరిశుభ్రతపై జిల్లా పంచాయతీ అధికారి వివరించగా, తాగునీటి సరఫరా మరియు వేసవి కార్యాచరణ ప్రణాళికపై ఆర్డబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వివరించారు. ఉపాధి హామీ పథకం,  ఎస్ ఈ ఆర్ పి కార్యక్రమాలు, వనమహోత్సవం, నర్సరీల ఏర్పాటు, పచ్చదనం పెంపు వంటి అంశాలపై డిఆర్డిఓ సురేందర్  అవగాహన కల్పించారు. విద్య, ఆరోగ్యం, పోషకాహారం, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, యువజన కార్యకలాపాలు తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులు వివరాలు అందించారు. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించగా, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణరక్షణకు సంబంధించిన సిపిఆర్  ప్రదర్శనను వైద్య బృందం నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఏఎస్పీ చైతన్య రెడ్డి, అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, మున్సిపల్ చైర్‌పర్సన్‌లు, కౌన్సిలర్లు, సర్పంచులు, వార్డు సభ్యులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -