Thursday, March 12, 2026
E-PAPER
Homeఖమ్మంయాంటీ డ్రగ్ అవేర్ నెస్

యాంటీ డ్రగ్ అవేర్ నెస్

- Advertisement -

– డ్రగ్స్‌ కు దూరంగా ఉండాలి
– ఈగిల్ ఫోర్స్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ
– విద్యార్థులతో మానవహారం
– నాలుగు ప్రాంతాల్లో కార్యక్రమాలు
నవతెలంగాణ – అశ్వారావుపేట:
యువత డ్రగ్స్‌ కు దూరంగా ఉండాలని ఈగిల్ ఫోర్స్ డీఎస్పీ బుచ్చయ్య సూచించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల యువతలో డ్రగ్స్ వినియోగం పెరుగుతుండటం ఆందోళనకరమన్నారు.ఒకసారి డ్రగ్స్ అలవాటు పడితే దాని నుంచి బయటపడటం చాలా కష్టమని తెలిపారు.సరదాగా ప్రారంభించిన అలవాటు తరువాత జీవితాన్ని నాశనం చేసే స్థాయికి తీసుకెళ్తుందని హెచ్చరించారు.

డ్రగ్స్‌ కు బానిసైన వ్యక్తులు కుటుంబ సభ్యులు, స్నేహితుల నుండి దూరమవుతారని, మానసికంగా, శారీరకంగా నష్టపోతారని చెప్పారు. చదువు, ఉద్యోగం, కుటుంబ జీవితం దెబ్బతిని చివరకు ఆర్థిక ఇబ్బందులు, నేరాలకు దారి తీసే ప్రమాదం ఉందన్నారు.

ఎస్.హెచ్.ఓ ఎస్‌ఐ యయాతి రాజ్ మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం గ్రామాలకు కూడా వ్యాపిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. యువత ప్రవర్తనపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిశితంగా గమనించాలని సూచించారు.

అనంతరం ఈగిల్ ఫోర్స్ అధికారులు, పోలీసులు, ఎక్సైజ్, రెవెన్యూ శాఖ సిబ్బంది, విద్యార్థులు, యువత, స్థానిక ప్రజలతో కలిసి పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వ్యతిరేక నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీ అనంతరం పోలీస్ స్టేషన్ కూడలి వద్ద విద్యార్థులు, అధికారులు కలిసి మానవహారం ఏర్పాటు చేసి డ్రగ్స్‌ కు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేశారు.

అదేవిధంగా ఊట్లపల్లి, వినాయకపురం, ఆసుపాక గ్రామ పంచాయతీలలో కూడా అవగాహన సదస్సులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం ఒక మున్సిపాలిటీ తో పాటు మూడు గ్రామాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ సాంబమూర్తి, ఎస్.హెచ్.ఓ యయాతి రాజు, తాహాశీల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ, విద్యాశాఖ మండల అధికారి పొన్నగంటి ప్రసాదరావు, వ్యవసాయ శాఖ మండల అధికారి పర్సా శ్రీనివాసరావు, ఐసీడీఎస్ ఏసీడీపీఓ అలేఖ్య, విద్యార్థులు, ఉపాధ్యాయులు, మీడియా ప్రతినిధులు, ఆటో యూనియన్ సభ్యులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -