నవతెలంగాణ-హైదరాబాద్: సోషల్ మీడియా ప్రభావం మంచి కన్నా చెడే అధిక ప్రభావం చూపుతోంది. దీంతో పలు దేశాలతో పాటు భారత్‌లోని కర్నాటక, ఏపీ రాష్ట్రాలు మైనర్లు సోషల్ మీడియా వాడకంపై ఆంక్షలు విధించాయి. తాజాగా సోషల్ మీడియా ప్రభావంతో చిన్నారుల భవిష్యత్తు అంధకారమవుతోందని రాజ్యసభలో మాజీ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో విచ్చలవిడిగా లభిస్తున్న అసభ్యకరమైన, అశ్లీల సమాచారం (సాఫ్ట్ పోర్నోగ్రఫీ) యువతను, ముఖ్యంగా 12 ఏళ్ల ప్రాయంలో ఉన్న చిన్నారులను తప్పుదోవ పట్టిస్తోందని పేర్కొన్నారు. ఇన్స్టాగ్రామ్ వంటి వేదికలపై కేవలం ఒక్క క్లిక్‌తో ఇలాంటి కంటెంట్ అందుబాటులోకి రావడం వల్ల సామాజికంగా తీవ్ర నష్టం జరుగుతోందని ఆయన అన్నారు.
ఈ సామాజిక సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని హర్భజన్ సింగ్ కోరారు. పోర్నోగ్రఫీ వెబ్సైట్లను పూర్తిగా నిషేధించడంతో పాటు, ఆన్లైన్ కంటెంట్‌ను నియంత్రించేందుకు కఠినమైన డిజిటల్ నిబంధనలను రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు.



