నవతెలంగాణ-హైదరాబాద్: ‘జల్‌జీవన్ మిషన్’ కోసం పెండింగ్‌లో ఉన్న రూ.3,112కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ శుక్రవారం ప్రధాని మోడీకి లేఖ రాశారు. జల్‌శక్తి మంత్రిత్వ శాఖలోని తాగునీరు మరియు పారిశుధ్య విభాగం ఇటీవల హోగెనెక్కల్ ఫేజ్ 3 కంబైన్డ్ వాటర్ సప్లై స్కీమ్‌కు కేంద్రం సహాయం అందించలేమని వెల్లడించిందని ఆయన పేర్కొన్నారు. 2023 జూన్ 15న జల్‌శక్తి మంత్రిత్వ శాఖ రాష్ట్రస్థాయి పథకం మంజూరు కమిటీలో ఈ పథకం ఆమోదించబడిందని, దీనికి రూ.8,428కోట్లు ఖర్చయ్యాయని, ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.2,283 కోట్లు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. జల్‌జీవన్ మిషన్ కింద రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించిందని లేఖలో పేర్కొన్నారు. 1.12 కోట్ల నివాసాలకు ఇప్పుడు 1.25 కోట్ల గ్రామీణ నివాసాల్లో 90శాతం నివాసాలకు కుళాయి కనెక్షన్లు ఉన్నాయని అన్నారు. జల్‌జీవన్ మిషన్కింద కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ.5,914కోట్లను విడుదల చేసిందని, రూ.3,112 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు.
2024-25లో తమిళనాడుకు రూ.2,434 కోట్లు కేటాయించినప్పటికీ, రూ.732కోట్లు మాత్రమే విడుదలయ్యాయని, 2024 సెప్టెంబర్ నుండి నిధులు విడుదల కాలేదని లేఖలో పేర్కొన్నారు. అయితే సకాలంలో పనులు పూర్తి చేసేందుకు అవసరమైన ఖర్చుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తన నిధుల నుండి రూ.2,550కోట్లను ముందస్తుగా విడుదల చేసిందని అన్నారు. ప్రధాని మోడీ జోక్యం చేసుకుని ప్రస్తుతం అమలులో ఉన్న జలజీవన్ మిషన్ పథకాలను పూర్తి చేయడానికి పెండింగ్‌లో ఉన్న రూ.3,112కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

