గణితం పై పట్టు సాధిస్తే మేధస్సు చురుకుదనం పెరిగి అన్ని రంగాల్లోను మంచి ఫలితాలు పొందవచ్చని మండలంలోని హాస కొత్తూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డిఎల్ఎన్ చారీ, గణిత ఉపాధ్యాయులు కృష్ణ కుమార్ అన్నారు. శుక్రవారం శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని గణిత దినోత్సవ వేడుకలను పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం విద్యార్థుల చేత గణిత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గణితం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ప్రపంచ దేశాలలో ఘన కీర్తిని పొందిన రామానుజన్ లాగా ప్రతి ఒక విద్యార్థి ముందడుగు వేయాలని, గణితం అంటే భయం తొలగించుకోవడం ద్వారా ఆ విభాగంలో నిష్ణాతులు కావచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.