నవతెలంగాణ-హైదరాబాద్: అశోకా యూనివర్శిటీ ప్రొఫెసర్ అలీఖాన్‌పై క్రిమినల్ చర్యలను సుప్రీంకోర్టు సోమవారం రద్దు చేసింది. ఆపరేషన్ సిందూర్‌పై సోషల్‌మీడియా పోస్ట్‌లకు సంబంధించి ప్రొఫెసర్‌పై విచారణకు అనుమతి నిరాకరించినట్లు హర్యానా ప్రభుత్వం తెలిపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఒక్కసారి ఉదారతతో హర్యానా ప్రభుత్వాన్ని అనుమతి నిరాకరించాలని గతంలో ఆదేశించిన సంగతి తెలిసిందే.
ధర్మాసనం సూచనను ఆమోదించామని హర్యానా ప్రభుత్వం తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు కోర్టుకు తెలిపారు. ప్రొఫెసర్అలీఖాన్ భవిష్యత్తులో ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించాలని కోరారు. ”కొన్ని సార్లు పరిస్థితి సున్నితంగా ఉంటుందని, మనం జాగ్రత్తగా వ్యవహరించాలి” అని సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ అలీఖాన్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాదులు సిద్ధార్ద్ లూథ్రా, నిజామ్ పాషాలకు సిజెఐ సూచించారు.
ఆపరేషన్ సిందూర్‌పై అలీఖాన్ పోస్ట్‌లు దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను ప్రమాదంలో పడేశాయంటూ గతేడాది మే18న హర్యానా పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. మహిళా కమిషన్ రాష్ట్ర విభాగం చైర్పర్సన్ రేణుభాటియా, సొనిపేట్ జిల్లాలోని గ్రామ సర్పంచ్ ఫిర్యాదుల మేరకు అలీఖాన్‌పై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.



