నవతెలంగాణ-హైదరాబాద్: 98వ ఆస్కార్ అవార్డుల వేడుకల్లో మరోసారి రాజకీయ సందేశాలు వినిపించాయి. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ అవార్డును ప్రదానం చేయడానికి బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రాతో పాటు హాలీవుడ్ నటుడు జేవియర్ బార్డెమ్ వేదికపైకి వచ్చి పాలస్తీనాకు సంఘీభావ సందేశాన్ని పంచుకున్నాడు. జేవియర్ బార్డెమ్ పాలస్తీనాకు సంఘీభావం ప్రకటిస్తూ చేసిన వ్యాఖ్యలు వేడుకలో ప్రధాన చర్చగా మారాయి. “పాలస్తీనాను విముక్తి చేయండి… యుద్ధాన్ని ముగించండి” అని పిలుపునిచ్చారు. ఆయన మాటలను అంగీకరిస్తున్నట్లు ప్రియాంక చోప్రా తల ఊపగా, ప్రేక్షకులు చప్పట్లతో స్వాగతించారు. అనంతరం ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా నార్వేజియన్ చిత్రం సెంటిమెంటల్ వాల్యూ అవార్డును అందజేశారు. రెడ్ కార్పెట్‌పై కూడా బార్డెమ్ తన వైఖరిని స్పష్టం చేశారు. 2003లో జరిగిన ఇరాన్ యుద్ధ సమయంలో ధరించిన యుద్ధ వ్యతిరేక పిన్‌ను ఈసారి కూడా ధరించి వచ్చారు.
“2003లో ఇరాక్ యుద్ధానికి వ్యతిరేకంగా నేను ధరించిన అదే పిన్‌ను ఇప్పుడు కూడా ధరించాను. అది చట్టవిరుద్ధమైన యుద్ధం. 23 సంవత్సరాల తర్వాత మళ్లీ అలాంటి పరిస్థితినే చూస్తున్నాం” అని బార్డెమ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన డోనాల్డ్ ట్రంప్, బెంజమిన్ నెతన్యాహు పేర్లను ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు చేశారు.
ఇజ్రాయిల్‌తో వ్యాపారం చేసే అవకాశంపై ప్రశ్నించగా, జాతి నిర్మూలనను ప్రోత్సహించే కంపెనీ లేదా దేశంతో తాను ఎప్పటికీ వ్యాపారం చేయనని బార్డెమ్ స్పష్టం చేశారు.



