– వెల్లడించిన బైడెన్
– నెతన్యాహుతో సుదీర్ఘంగా ఫోన్లో చర్చలు
గాజా : అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఇజ్రాయిల్ అధ్యక్షుడు నెతన్యాహులు గాజాలో సాగుతున్న మిలటరీ ఆపరేషన్ లక్ష్యాలు, వాటి తీరుతెన్నులపై చర్చించారు. ఇరువురు నేతలు టెలిఫోన్లో సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు. గాజాలో కాల్పుల విరమణ గురించి తాను నెతన్యాహును అడగలేదని బైడెన్ చెప్పారు. శనివారం నెతన్యాహుతో తాను సుదీర్ఘంగా మాట్లాడానని, కానీ అదంతా ప్రైవేట్ సంభాషణ అని బైడెన్ విలేకర్లకు చెప్పారు. కాల్పుల విరమణ గురించి తాను ప్రస్తావించలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తర్వాత వైట్‌హౌస్ దీనిపై ఒక ప్రకటన చేసింది. గాజాలోని పౌరులను కాపాడాల్సిన అవసరాన్ని బైడెన్ నొక్కి చెప్పారని ఆ ప్రకటన పేర్కొంది. యుద్ధం జరుగుతున్న ప్రాంతాల నుండి దూరంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రజలను అనుమతించాల్సిన ప్రాముఖ్యతను కూడా వారు చర్చించారు. అలాగే మిగిలిన బందీలను కూడా సురక్షితంగా విడుదల చేయాల్సిన అవసరం వుందన్నారు. గాజాలో తక్షణమే సాయాన్ని పెంచాల్సిన అవసరం వుందని కోరుతూ భద్రతామండలి తీర్మానాన్ని ఆమోదించిన నేపథ్యంలో ఇరువురు నేతలు చర్చించారు. ఐక్యరాజ్య సమితిలో అమెరికా తీసుకున్న వైఖరిని నెతన్యాహు ఈ సందర్భంగా అభినందించారు. తామనుకున్న లక్ష్యాలన్నీ పూర్తిగా నెరవేరేవరకు ఇజ్రాయిల్ ఈ యుద్ధాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. గత 24గంటల్లో గాజాలో 200మందికి పైగా మరణించారు.