– అమెరికా, ఇజ్రాయిల్ లను ఎదుర్కుంటున్న హౌతీ మిలిటెంట్లు
ఇజ్రాయిల్ గాజాపైన చేస్తున్న ఘోరమైన మానవ హననాన్ని ఎదుర్కునేందుకు యెమెన్ లో అన్సరల్లా నాయకత్వంలోని హౌతీ మిలిటెంట్లు సిద్ధపడ్డారు. ముందుగా ఇజ్రాయిల్ వైపు డ్రోన్లను, క్రూయిజ్ మిసైల్లను ప్రయోగించిన హౌతీ మిలిటెంట్లు ఆ తరువాత ఎర్ర సముద్రం గుండా ప్రయానిస్తున్న ఇజ్రాయిల్ కి చెందిన నౌకల రవాణాను అడ్డుకోవటం మొదలెట్టారు. అంతేకాకుండా ఎర్ర సముద్రంలోని ఏకైక ఇజ్రాయిలీ ఓడ రేవు యైలాత్ కు వచ్చే రవాణా మార్గాన్ని పూర్తిగా మూసివేశారు. హౌతీ మిలిటెంట్లు అనేక నౌకలను స్వాధీనం చేసుకుని, మరెన్నో నౌకలపైన డ్రోన్లతో దాడులు చేస్తున్నారు. దానితో యైలాత్ ఓడరేవులో కార్యకలాపాలు 85శాతం మేరకు స్తంభించాయి. పర్యవసానంగా అంతర్జాతీయ, ఇజ్రాయిలీ షిప్పింగ్ కంపెనీలు దక్షిణాఫ్రికాను చుట్టివచ్చే, 12రోజులు అదనంగా పయనించవలసివచ్చే సుదూర మార్గాన్ని ఎంచుకుంటున్నాయి.
హౌతీ మిలిటెంట్ల దాడులను అడ్డుకోవటానికి ఒక బహుళ దేశ నౌకా దళాన్ని ప్రవేశపెట్టాలని అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ చేసిన సూచనపట్ల ఆ ప్రాంతంలోని దేశాలైన సౌదీ అరేబియా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏమాత్రం ఆసక్తిని చూపటం లేదు. అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం ఒక ప్రాంతంలో సైన్యాన్ని ప్రవేశపెట్టాలంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం మద్దతు అవసరం ఉంటుంది. అది అందుబాటులోలేని స్థితిలో అమెరికా మరో విదేశీ జోక్యానికి సిద్ధపడినట్టయింది. ఇలా అమెరికా చేసుకోదలిచిన జోక్యానికి ప్రాంతీయ దేశాల మద్దతు కొరవడటం అమెరికా ప్రాబల్య క్షీణతను సూచిస్తోంది. అంతేకాకుండా అమెరికా జోక్యం యెమెన్ కు చెందిన అన్సరల్లా స్థాయిని పెంచింది. 2014లో అప్పటి యెమెన్ అధ్యక్షుడు అబ్ద్రబ్రు మన్సూర్ కి వ్యతిరేకంగా సాగిన ఒక ప్రజా ఉద్యమం ద్వారా అన్సరల్లా అధికారంలోకి వచ్చాడు. 2015లో యెమెన్ రాజధాని సనాలో అన్సరల్లా అధికారాన్ని కూలదోయటానికి సౌదీ అరేబియా నేత్రుత్వంలో అమెరికా మద్దతుతో యెమెన్ లో 7సంవత్సరాలపాటు చేసిన సైనిక జోక్యంలో దాదాపు 4లక్షల మంది ప్రజలు మరణించారు. అయినప్పటికీ అన్సరల్లా అధికారాన్ని కదిలించలేకపోయారు.
పశ్చిమ దేశాల కార్పొరేట్ మీడియా ”ఇరాన్ మద్దతుగల తిరుగుబాటుదారులు” అని పిలిచే అన్సరల్లా నాయకత్వంలోని హౌతీ మిలిటెంట్ల సాయుధ సామర్థ్యం ఏమిటో పైన వివరించిన యుద్ధం తెలియజేస్తుంది. హౌతీ మిలిటెంట్లను ఎదుర్కోవటానికి అమెరికా ప్రతిపాదించిన బహుళ జాతి నౌకా దళం ఈ మిలిటెంట్లు ఆ ప్రాంతంలో ప్రాబల్యంగల శక్తి అని చెప్పకనే చెబుతోంది. సనాలోని అన్సరల్లా ప్రభుత్వాన్ని కూలదోయటానికి అమెరికా చేసిన ప్రయత్నంవల్ల యెమెన్ లో ఒక బలమైన సైనిక శక్తి ఆవిర్బవించింది. 2021లో అమెరికా విదేశాంగ విధానంపైన అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ఉపన్యాసంలో యెమెన్ లో జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని చెప్పాడు. అయితే యెమెన్-సౌదీ అరేబియాల మధ్య సంధి కుదర్చటానికి బదులుగా అమెరికా సౌదీ అరేబియా-ఇజ్రాయిల్ ల మధ్య ఒప్పందాన్ని కుదిర్చింది. ఆ తప్పే ఇప్పుడు అమెరికా విధాన నిర్ణేతలను ఎక్కిరిస్తోంది.
గాజాపైన ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధానికి అపరిమిత స్థాయిలో మద్దతునిస్తున్న అమెరికా యుద్ధాన్ని అరబ్-ఇజ్రాయిల్ యుద్ధంగా పరిణామం చెందేలా చేస్తోంది. ఇజ్రాయిల్ సైన్యం లెబనీస్ హెజ్బొల్లా మిలిటెంట్లతో తలపడటం రోజురోజుకూ దగ్గరౌతోంది. గాజాపైన ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధానికి అమెరికా ఇస్తున్న అపరిమిత మద్దతు పశ్చిమ ఆసియాలో అమెరికాను ఏకాకిని చేస్తోంది. ఆ ప్రాంతంలోని దేశాలన్నీ గాజాపైన తక్షణం యుద్ధం ఆపాలని రష్యా, చైనాలు చేస్తున్న డిమాండ్ కు తమ మద్దతునిస్తున్నాయి. అమెరికా పాటిస్తున్న ద్వంద ప్రమాణాలను ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి. కేవలం రెండు నెలలలో 23వేల మందిని ప్రధానంగా మహిళలను, పిల్లలను హతమార్చటం చరిత్రలో ఒక మచ్చగా మిగిలిపోతుంది. గాజాలాంటి ఒక చిన్న ప్రాంతంలో ఇంతగా మానవ హననం జరగటం ఆధునిక చరిత్రలో కనపడదు. ఇంత జరుగుతున్నా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కాల్పుల విరమణ తీర్మానాలను అమెరికా పదేపదే అడ్డుకుంటోంది. ప్రస్తుతం తన కూటమిలోని దేశాలను యెమెన్ పైన యుద్ధం చేయటానికి లాగుతోంది. గాజాపైన ఇజ్రాయిల్ యుద్ధ విరమణను ప్రకటిస్తేనే ఎర్ర సముద్రంలో రవాణా నౌకలపైన తమ దాడులు ఆగుతాయని అన్సరల్లా ప్రకటించాడు. యుద్ధాన్ని ఆపే శక్తి అమెరికాకు ఉన్నా ఆపటానికి సిద్దపడటం లేదు. యెమెన్ పైన అమెరికా కూటమి దేశాలు యుద్ధాన్ని ప్రకటిస్తే అది యుద్ధ విస్తరణకే దారితీస్తుంది తప్ప సమస్యను పరిష్కరించటానికి ఉపయోగపడదు.