నవతెలంగాణ-హైదరాబాద్: ” హీరోయిన్లను కూడా హీరోలతో సమానంగా గౌరవంగా చూడండి ” అంటూ … సినీనటి అనుష్క టీం కోరింది. గత కొన్ని రోజులుగా సినీనటి అనుష్క పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఏడాది ఆమె ఓ వ్యాపారవేత్తతో పెళ్లిపీటలెక్కనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆమె టీం స్పందించి స్పష్టతనిచ్చింది. ఆ వార్తలను ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. ” ఒకరి వ్యక్తిగత జీవితాన్ని రోజువారీ ముఖ్యాంశాలుగా మార్చే ముందు కనీసం అది అధికారికమా, కాదా.. అని కూడా చూడడం లేదు. ఊహించడం, అంచనా వేయడం, అనధికారిక సమాచారాన్ని పదేపదే ప్రచురించడం సరైన పద్ధతి కాదు. అన్నిటికంటే నిరాశ కలిగించే విషయం ఏమిటంటే.. ఆమె వయసుపై అనవసరమైన శ్రద్ధ చూపడం. ప్రతి పోస్ట్‌లోనూ ’44’ అనే నంబర్‌ను ఏదో వివాదాస్పదమైన అంశంలా ఎందుకు హైలైట్ చేస్తున్నారు ? వయసు అంత పెద్ద సమస్య అయితే.. హీరోల వయసు విషయంలో కూడా ఇదే ఉత్సాహం ఎందుకు కనిపించడం లేదు ? మహిళల విషయంలోనే ఈ కథనం ఎందుకు భిన్నంగా ఉంటుంది?” అని అనుష్క టీం ప్రశ్నించింది.
”అనుష్క శెట్టి తన కెరీర్‌ను గౌరవం, ప్రతిభతో హుందాగా నిర్మించుకున్నారు. ఆమె ఎప్పుడూ పీఆర్ స్టంట్స్‌పై ఆధారపడలేదు. తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుకోవాలని కోరుకునే వ్యక్తిని ఇలా టార్గెట్ చేయడం అన్యాయం. ప్రతిఒక్కరూ తమ జీవితంలో జరిగే విషయాలను అందరికీ చెప్పాలని అనుకోరు. ఆ నిర్ణయాన్ని గౌరవించాలి. వివాహం అనేది వ్యక్తిగత విషయం. ఇది బ్రేకింగ్ న్యూస్ కాదు, ట్రెండ్ కాదు, కేవలం వ్యూస్ కోసం సెన్సేషనలైజ్ చేయాల్సిన విషయం అంతకంటే కాదు. ఇకనైనా బాధ్యతగా వ్యవహరించండి. హద్దులను గౌరవించండి. ప్రచురించే ముందు నిజాన్ని నిర్థారించుకోండి. ముఖ్యంగా హీరోయిన్లను కూడా హీరోలతో సమానంగా గౌరవంగా చూడండి” అని టీమ్ పేర్కొంది.



