నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ), బీజేపీ ప్రభుత్వంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బెంగాల్‌లో అనధికార అత్యవసరస్థితిని కలిగించి అధికారుల బదలాయింపులు చేపడుతున్నారని మండిపడ్డారు. ఇది యాదృచ్చికంగా జరుగుతుందని కాదని, ముందస్తూ ప్రణాళిక ప్రకారమే నిర్ణయించబడిందని ఆమె ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఉన్నతాస్థాయి అధికారులను సెలెక్ట్ చేసుకొని మరి మొత్తం 50 మంది అధికారులను బదిలీ చేశారని, ఇది ఆన్ డిక్లర్డ్ ఎమర్జెన్సీ అని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
“ఉన్నతాధికారుల భారీస్థాయి బదిలీలు పరిపాలనా అవసరాన్ని కాకుండా రాజకీయ జోక్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఎన్నికల సంఘం బెంగాల్‌ను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్న తీరు అపూర్వమైనది మాత్రమే కాదు- ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల అధికారిక ప్రకటన వెలువడక ముందే, ముఖ్య కార్యదర్శి, హోం కార్యదర్శి, డీజీపీ, ఏడీజీలు, ఐజీలు, డీఐజీలు, జిల్లా మేజిస్ట్రేట్లు, పోలీసు సూపరింటెండెంట్లతో సహా 50 మందికి పైగా ఉన్నతాధికారులను ఏకపక్షంగా, అకస్మాత్తుగా తొలగించారు’’ అని పేర్కొన్నారు.



