– జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ రాజేష్ చంద్ర
నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ‘శ్రీ పరాభవ’ నామ సంవత్సర పంచాంగ శ్రవణం, ప్రత్యేక పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర అతిథిగా హాజరై పూజలు నిర్వహించి పంచాంగ శ్రవణాన్ని ఆలకించారు.
అనంతరం విచ్చేసిన వారందరికీ ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉగాది పచ్చడి కేవలం ఆరు రుచుల సమ్మేళనం మాత్రమే కాకుండా మన భారతీయ సంస్కృతి గొప్పతనానికి ప్రతీక అని తెలిపారు. జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని ఉగాది పచ్చడి సూచిస్తుందని పేర్కొన్నారు.
మన సాంప్రదాయాలను గౌరవిస్తూ, వాటిని స్ఫూర్తిగా తీసుకుని నూతన సంవత్సరాన్ని ఆశావాదంతో ఆహ్వానించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ, వారి కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
గత సంవత్సరంలో జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు అందించిన సహకారాన్ని ఎస్పీ ఈ సందర్భంగా ప్రశంసించారు. “కామారెడ్డి పోలీసులు ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటారు. వారి సంతోషాల్లో భాగస్వాములవడమే కాకుండా కష్టకాలంలో వెన్నుముకగా నిలుస్తాం” అని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, టౌన్ ఎస్హెచ్ఓ నరహరి, రూరల్ సీఐ రామన్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, పట్టణ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.



