నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా భారత్‌లో తీవ్రంగా గ్యాస్ సంక్షోభం నెలకొంది. గ్యాస్ కొరత వల్ల బెంగళూరులో వ్యాపారాలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో వాణిజ్య ఎల్‌పిజి గ్యాస్ కొరతని తీర్చాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం కేంద్ర పెట్రోలియం శాఖామంత్రికి లేఖ రాశారు. బెంగళూరులో నెలకొన్న గ్యాస్ కొరత ప్రజల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని, గ్యాస్ కొరతను తీర్చడానికి హర్దీప్ సింగ్ పూరి తక్షణమే జోక్యం చేసుకోవాలని సిద్ధరామయ్య తన లేఖలో పేర్కొన్నారు.
ప్రాధాన్యతా, నిత్యావసర రంగాలకు సరఫరాను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. రోజుకు 50 వేల సిలిండర్ల డిమాండ్ ఉండగా… సరఫరా కేవలం వెయ్యి సిలిండర్లకే పరిమితం కావడంతో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దీనివల్ల వ్యాపారాలు, హోటళ్లు మూతపడుతున్నాయి. డిమాండ్‌కు తగ్గట్టుగా గ్యాస్‌ని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని సిద్ధరామయ్య తన లేఖలో కేంద్ర మంత్రిని కోరారు. ఈమేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు



