నవతెలంగాణ-హైదరాబాద్: ఇంగ్లాండ్ ప్రభుత్వం అన్ని రకాల వీసా ఫీజులను అమాంతం పెంచింది. వీసా, సెటిల్మెంట్, స్పాన్సర్ లైసెన్స్ ఫీజుల కొత్త ఛార్జీలు ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి రానున్నాయని తెలిపింది. ఈ మేరకు హోమ్ ఆఫీస్ ఒక ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తుల రుసుములు సుమారు ఆరు నుంచి ఏడు శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
విద్యార్థి వీసా రుసుములు 524 పౌండ్ల నుంచి 558 (రూ.69,814) పౌండ్లకు పెరగనున్నాయి. ఆరు నెలల విజిటర్ వీసా ఛార్జీ 127 పౌండ్ల నుంచి 135 (రూ.16,890) పౌండ్లకు పెరుగుతుంది. కార్మిక వీసా దరఖాస్తు రుసుము 769 పౌండ్ల నుంచి 819 (రూ.1,02,470) పౌండ్లకు పెరగనుంది. మూడేళ్లకు పైగా ఉండే దరఖాస్తుల రుసుము 1519 నుంచి 1618 (రూ.2,02,437) పౌండ్లకు పెరగనుంది.



