నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల కోసం రూ.9వేల కోట్ల ‘రైతు భరోసా’ నిధులను నేడు విడుదల చేయనున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా నర్మెట వేదికగా దీనికి శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో రేవంత్ పోస్ట్ చేశారు.
‘‘అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నా. రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నా. 70 లక్షల మంది రైతన్నల కోసం రూ.9000 కోట్ల రైతు భరోసా నిధుల విడుదలకు నేడు శ్రీకారం చుడుతున్నాం. సిద్దిపేట జిల్లా నర్మెట వేదికగా మరోసారి మా పాలనలో రైతే రాజు అని రుజువు చేస్తూ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఆర్థిక సాయంతో చేతులు దులుపుకోవడం కాదు.. కేవలం 17 నెలల వ్యవధిలో పామాయిల్ పరిశ్రమ మొదలు పెట్టి, పూర్తి చేసి నేడు రైతు లోకానికి అంకితం చేస్తున్నాం. దానికి కొనసాగింపుగా రిఫైనరీ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తున్నాం’’ అని సీఎం పేర్కొన్నారు.



