Monday, March 23, 2026
E-PAPER
Homeనేటి వ్యాసంభగత్ సింగ్ స్ఫూర్తితో మత్తును వీడాలి… మతోన్మాదాన్ని తరిమేయాలి

భగత్ సింగ్ స్ఫూర్తితో మత్తును వీడాలి… మతోన్మాదాన్ని తరిమేయాలి

- Advertisement -
  • ఆయన పేరు పలికితేనే రోమాలు నిక్కబొడుస్తాయి… ఆ త్యాగగాథ తలచుకుంటే రక్తం రగిలిపోతుంది. తెల్లదొరల పాలనను అంతం చేయడానికి అగ్నిజ్వాలలా మారిన వ్యక్తి అతడు. “స్వాతంత్ర్యం నా జన్మహక్కు” అని నినదించిన వ్యక్తి అతడు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి ఎదిరించి నిలిచిన యోధుడు అతడు. భవిష్యత్‌కు బలమైన బీజం వేయాలని తపనతో పార్లమెంటుపై బాంబు విసిరిన విప్లవ వీరుడు అతడు. విప్లవం ద్వారానే విజయం సాధ్యమని నమ్మిన మహోన్నత ఘనుడు అతడు — ఆయనే భగత్ సింగ్. ఇది కేవలం ఓ వ్యక్తి కాదు; దేశ చైతన్యాన్ని మేల్కొలిపే మహత్తర శక్తి, శాశ్వత స్ఫూర్తి.

    “నేను ప్రేమించినా.. పెళ్లాడినా అది నా మాతృభూమినే! నా ధ్యాస, నా శ్వాస, నా సర్వస్వం నా దేశం. ఈ గడ్డపై పుట్టినా, ఈ మట్టిలో కలిసిపోయినా అది నా దేశ విముక్తి కోసమే కావాలి.”

    “నన్ను చంపగలరు, నా ఆశయాలను కాదు” అన్న ఆయన ఉక్కు నినాదం, ఉరికొయ్యపై చిరునవ్వుతో నిలిచిన అతని అపార ధైర్యం — ఇవి చరిత్ర పుటల్లో నిలిచిన శాశ్వత జ్యోతులు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారు ఎల్లకాలం జీవిస్తారనే సత్యానికి భగత్ సింగ్ చిరస్మరణీయ నిదర్శనం.

    “నన్ను మీరు చంపగలరేమో కానీ.. నా ఆశయాన్ని చంపలేరు. నా దేహం నుంచి చిందే ప్రతి రక్తపు చుక్క ఏరులై ప్రవహించి, ఈ దేశ మట్టిని తడపాలి. ఆ రక్తపు వాసన ప్రతి భారతీయుడిలో స్వదేశీ చైతన్యమై వికసించాలి. ఆ చైతన్యం తెల్లదొరల పాలనకు చరమగీతం పాడాలి .”

    1907 సెప్టెంబర్ 28న నేటి పాకిస్తాన్‌లోని లాయల్పూర్ జిల్లా బంగాలో కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు భగత్ సింగ్ జన్మించాడు. చిన్ననాటి నుంచే దేశభక్తి అతని నరనరాల్లో నింపుకుంది. 12 ఏళ్ల వయసులోనే జలియన్‌వాలాబాగ్ దారుణాలను చూసి రగిలిపోయాడు. 14 ఏళ్లకే స్వాతంత్ర్యోద్యమంలో అడుగుపెట్టాడు. మహాత్మా గాంధీ పిలుపుతో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ, ఆ ఉద్యమాన్ని నిలిపివేయడాన్ని సమర్థించలేదు. స్వాతంత్ర్యం యాచిస్తే రాదని, పోరాడితేనే సాధ్యమని గ్రహించాడు.
    కుటుంబ సభ్యులు పెళ్లి చేసేందుకు ప్రయత్నించగా, “నా జీవితాన్ని మాతృదేశ విముక్తి అనే ఉన్నతాశయానికి అంకితం చేశాను. కుటుంబ సుఖాల పట్ల నాకు మోజు లేదు” అంటూ తండ్రికి ఉత్తరం రాసి ఇంటిని విడిచాడు. అనంతరం నవజవాన్ భారత్ సభలో చేరి యువతను చైతన్యపరిచాడు. తర్వాత హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌లో చేరి సుఖ్‌దేవ్, రాజ్‌గురులతో కలిసి విప్లవ కార్యకలాపాలను కొనసాగించాడు.

    ” *నేను తుపాకి మొక్కలు నాటుతున్నాను నాన్నా! ఇవి పెరిగి పెద్దవై వేల తుపాకులుగా వికసించాలి. ఆ ఆయుధాలను నా దేశ ప్రజలకు పంచి, ఈ తెల్లదొరల గుండెల్లో నిద్రపోతా “

  • 1927లో సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమం సందర్భంగా లాలా లజపతిరాయ్‌పై జరిగిన లాఠీచార్జ్ ఆయన మరణానికి దారితీసింది. దీనికి ప్రతీకారంగా బ్రిటిష్ అధికారి సాండర్స్‌ను భగత్ సింగ్, రాజ్‌గురు హత్య చేశారు. 1929లో పార్లమెంట్ లో బట్టుకేశ్వర్ దత్‌తో కలిసి బాంబులు విసిరి “ఇంక్విలాబ్ జిందాబాద్” నినాదాలతో దేశాన్ని కుదిపేశారు. “చెవిటివారికి వినిపించాలంటే శబ్దం బిగ్గరగా ఉండాలి” అన్న ఆయన మాటలు పోరాటానికి నూతన అర్థం ఇచ్చాయి. తప్పించుకునే అవకాశం ఉన్నా, ప్రజల్లో చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో పోలీసులకు లొంగిపోయాడు.
    1931 మార్చి 23న లాహోర్ జైలులో భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులను బ్రిటిష్ పాలకులు ఉరిశిక్ష అమలు చేశారు. ఉరికంబం ముందున్నా వారు భయపడలేదు; చిరునవ్వుతోనే మృత్యువును కౌగిలించుకున్నారు. “దేవుడిని స్మరించు” అన్నపుడు, “ప్రజలకు కష్టాలు ఇస్తున్నందుకు దేవుడిని ఎన్నోసార్లు ప్రశ్నించాను” అన్న ఆయన సమాధానం అతని ఆలోచనా స్వేచ్ఛకు నిదర్శనం. అందుకే ఆయనను కేవలం విప్లవకారుడిగానే కాక, భావజాల యోధుడిగా కూడా గుర్తిస్తారు. మార్చి 23ను ‘షహీద్ దివస్’గా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.

    కాసేపు ఆగండి! మృత్యువు గడప వద్ద ఉన్నా సరే.. ఒక విప్లవకారుడు మరో విప్లవకారుడితో (లెనిన్ పుస్తకంతో) సంభాషిస్తున్నాడు . ఈ అధ్యాయం పూర్తి కానివ్వండి.. నా జ్ఞాన దాహం తీరనివ్వండి. నేను చనిపోయేది శరీరంతోనే తప్ప, ఈ పుస్తకంలో నేను చదివిన ఆలోచనలతో కాదు. ఆ ఆలోచనలే రేపు నా దేశ ప్రజల గొంతుకలై ప్రతిధ్వనిస్తాయి.”

    భగత్ సింగ్ కలలుగన్నది కేవలం రాజకీయ స్వాతంత్ర్యం కాదు; లౌకికత, సమానత్వం, సోషలిజం ఆధారంగా సమసమాజ నిర్మాణం. సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ వ్యవస్థ, భూస్వామ్య కట్టుబాట్లు, కుల-మత వివక్షలపై ఆయన పోరాటం నేటికీ స్ఫూర్తిదాయకం. ఆయన పేరు ప్రజల మనసుల్లో శాశ్వతంగా నిలిచి, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటాలకు ప్రేరణగా నిలుస్తోంది.
    నేటి పరిస్థితుల్లో సమాజం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. మతం, కులం పేరుతో విభజనలు పెరుగుతున్నాయి. మతోన్మాదాన్ని రెచ్చగొట్టే శక్తులు బలపడుతున్నాయి. విద్య, వైద్య రంగాలు పేదలకు అందని ద్రాక్షగా మారుతున్నాయి. నిరుద్యోగం పెరుగుతోంది. ప్రపంచ రాజకీయ పరిణామాలు, యుద్ధాలు సాధారణ ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి.
    ఇక యువతలో వ్యసనాల పెరుగుదల ఆందోళనకరం. గంజాయి, డ్రగ్స్ వంటి దురలవాట్లకు బానిసలవుతున్న యువశక్తి భవిష్యత్తును కోల్పోతోంది. ఆన్లైన్ బెట్టింగ్ వంటి ప్రమాదకర ధోరణులు జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వ్యసనాలను అరికట్టడం, యువతను సరైన దిశలో నడిపించడం అత్యవసరం.
    భగత్ సింగ్ స్ఫూర్తితో యువత మేల్కొనాలి. మతోన్మాదానికి వ్యతిరేకంగా, కుల-మత అడ్డుగోడలను కూల్చేందుకు, మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ముందుకు రావాలి. ఉపాధి అవకాశాల కోసం, సమానత్వ సమాజ నిర్మాణం కోసం పోరాడాలి. ప్రజా సమస్యలపై చైతన్యంతో నిలబడి ఉద్యమాలను బలోపేతం చేయాలి.
    భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ కలలు కన్న సమాజం కోసం పోరాడినప్పుడే వారికి నిజమైన నివాళి అర్పించినవారమవుతాం. వారి త్యాగం చరిత్రలో మాత్రమే కాకుండా, మన ఆచరణలోనూ ప్రతిఫలించాలి.

    వ్యక్తులను చంపడం సులభం, కానీ గొప్ప ఆశయాలను చంపలేరు. సామ్రాజ్యాలు కుప్పకూలవచ్చు కానీ భావాలు అమరంగా మిగిలిపోతాయి.” – ఇది భగత్ సింగ్ వదిలిన సందేశం. ఆ సందేశాన్ని గుండెల్లో నింపుకుని నవ భారతాన్ని నిర్మిద్దాం!
    పూలమాలలేనా నివాళి?
    ప్రతి ఏటా జయంతి, వర్ధంతి… చిత్రపటాలకు పూలమాలలు… రెండు నినాదాలు… మౌనం…ఇదేనా భగత్ సింగ్ త్యాగానికి మనం ఇచ్చే ప్రతిఫలం? ఖచ్చితంగా కాదు! అన్యాయం రాజ్యమేలుతున్నప్పుడు మౌనం కాదు — ప్రశ్నించడమే విప్లవం. విద్య, ఉపాధి, స్త్రీ స్వేచ్ఛ, కార్మిక హక్కుల కోసం పోరాటమే నిజమైన నివాళి. కులమత గోడలు కూలాలి… మతోన్మాదం చెదరాలి… సమాన సమాజం నిర్మించాలి. విగ్రహాలకు పూలమాలలు కాదు… ఆశయాలకు ఆచరణే గౌరవం.అదే భగత్ సింగ్‌కు మనం అర్పించే నిజమైన అక్షర నీరాజనం!
    ఇంక్విలాబ్ జిందాబాద్!
    – గడగోజు రవీంద్రాచారి,
    9848772232
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -