– రాత్రి వేళల్లో జోరుగా అక్రమ ఇసుక రవాణా
– అధికారుల నిర్లక్ష్యంపై అనుమానాలు
నవతెలంగాణ-రాయికల్: రాయికల్ మండల పరిధిలోని బోర్నపల్లి గోదావరి తీర ప్రాంతంలో గత 2 నెలలుగా అక్రమ ఇసుక తవ్వకాలు,రవాణా జరుగుతున్నాయనే ఆరోపణలు కోకొల్లలుగా వినిపిస్తున్నాయి.ముఖ్యంగా రాత్రివేళల్లో ఈ కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయనే సమాచారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.స్థానికుల అభిప్రాయం ప్రకారం,గోదావరిలో జెసిబిలతో ఇసుక తవ్వకాలు చేపట్టి, టిప్పర్ల ద్వారా జగిత్యాల, నిర్మల్ జిల్లాల వైపు తరలిస్తున్నారని చెబుతున్నారు. బోర్నపల్లి బ్రిడ్జికి అవతల ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఈ కార్యకలాపాలు కొనసాగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
కడెం మండలం చిన్న బెల్లాల్ గ్రామ పరిధిలో అక్రమ ఇసుక రవాణా కోసం కొందరు నిర్వాహకులు లక్షల్లో టెండర్లు నిర్వహించుకున్నట్లు సమాచారం.ఈ టెండర్ల ద్వారా ఇసుక రవాణాను వ్యవస్థీకృతంగా కొనసాగిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇదే సమయంలో, చిన్న బెల్లాల-బోర్నపల్లి సరిహద్దు ప్రాంతాల్లో కొందరు ప్రభావశీలుల ప్రమేయం ఉందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.కొంతమంది స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం,రాత్రి వేళల్లో అధికారుల పర్యవేక్షణ తక్కువగా ఉండటాన్ని అవకాశంగా తీసుకొని ఈ రవాణా జరుగుతోందని అంటున్నారు. బోర్నపల్లి, వడ్డెలింగాపూర్ మార్గాల ద్వారా రాత్రివేళల్లో టిప్పర్లు నిరంతరం సంచరిస్తున్నాయని, ఒక వైపు జగిత్యాల జిల్లా, మరోవైపు ఖానాపూర్, నిర్మల్ జిల్లాలకు ఇసుక తరలిస్తున్నట్లు చెబుతున్నారు.
ఈ వ్యవహారంలో కడెం మండలానికి చెందిన అధికార పార్టీ కి చెందిన ఓ రాజకీయ నాయకుడికి,రాయికల్ మండలంలోని ఓ నాయకుడికి అనుబంధాలు ఉన్న కొందరు ప్రముఖ వ్యక్తుల పేర్లు కూడా చర్చలోకి వస్తున్నాయి.అయితే ఇలాంటి ఆరోపణలు రావడం స్థానిక ప్రజల్లో అనుమానాలను పెంచుతోంది. ఇసుక అక్రమ రవాణా వల్ల ప్రభుత్వానికి ఆదాయ నష్టం కలగడమే కాకుండా,గోదావరి తీర ప్రాంత పర్యావరణానికి కూడా ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు.మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇసుక లభించడం లేదని ఓవైపు లబ్ధిదారులు తలలు పట్టుకుంటే, మరోవైపు మండల సరిహద్దులు దాటి ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగడంపై అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని లబ్ధిదారులు వాపోతున్నారు.
అదేవిధంగా, అనధికారిక తవ్వకాలు నదీ ప్రవాహాన్ని ప్రభావితం చేసే ప్రమాదం కూడా ఉందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై సంబంధిత శాఖల నుంచి ఎటువంటి అధికారిక స్పందన లేకపోవడం గమనార్హం. ఉన్నతాధికారులు దృష్టి సారించి, సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలు బయటపెట్టాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. పారదర్శక చర్యలు తీసుకుంటేనే అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట పడుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.



